ఈ జనసంద్రం సమీకరణకి జేబులు ఖాళీ?

Jagan Srikakulam rally

నేడు శ్రీకాకుళం పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జన సముద్రమే… విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా ఉత్తరాంధ్రా ప్రజలు జగన్‌ని జేజేలు పలికారు. జగన్‌కి లభిస్తున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం షాక్ అవుతోందంటూ వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియా చెప్పుకుంటోంది.

అందుకే కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులతో జనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, కానీ జగన్‌ కోసం జనం అన్ని అవరోధాలు దాటుకొని తమ ప్రియతమ నేతని ఒక్కసారి కనులారా చూసేందుకు పోటెత్తారని వ్రాసుకున్నాయి. ఇలాంటి మాటలు చాలా సమ్మగా ఉంటాయి… డబ్బు మనది కాకపోతే!

ADVERTISEMENT

జగన్‌ ఎప్పుడు ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టినా ఆయన కోసం జనాలు ఆరాటపడిపోతున్నారని నిరూపించే బాధ్యత ఆయా జిల్లాలు, నియోజకవర్గాల వైసీపీ నేతలదే.

కనుక నేడు ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు ఎంతో శ్రమించి జనసమీకరణ చేసిన మాట వాస్తవం. వారిని చూపిస్తూ జనసముద్రం, ప్రజాభిమానం అనుకుంటే ఎవరికి అభ్యంతరం?

ఇలాంటి సందర్భాలలోనే ఇదివరకు డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఓ సమావేశంలో అన్న మాటలు గుర్తువస్తాయి. “నేను వస్తే వేలాదిగా అభిమానులు తరలివస్తారు. ఈలలు, కేకలు వేస్తారు. చప్పట్లు కొడతారు. కానీ 2019 ఎన్నికలలో నేను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా గెలిపించలేదు. కనుక నా సభలకు వచ్చి చప్పట్లు కొట్టేవారందరూ తప్పకుండా మనకే ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని అప్పుడే గ్రహించాను,” అని అన్నారు.

తెలంగాణలో నన్ను కొట్టే మొనగాడే లేడనుకున్న కేసీఆర్‌ కూడా, ఆ తర్వాత ఇంచుమించు ఇదేవిధంగా మాట్లాడారు. కనుక ఇది వారిద్దరికే కాదు.. జగన్‌తో సహా రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది. కనుక వాపును చూసి బలుపు అనుకోకూడదు.

అయినా ఉత్తరాంధ్రకు జగన్‌ ఏం చేశారని ఆయనకు జేజేలు పలకాలి? కనీసం విశాఖను రాజధానిగా చేసినా ఇలా చెప్పుకుంటే నమ్మశక్యంగా ఉంటుంది. ఆ పేరుతో సుమారు రూ. 500 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి రుషికొండపై జగన్‌ నిర్మించుకున్న ప్యాలస్‌లు ఉత్తరాంధ్ర ప్రజలను నేటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయిగా? అయినా అపూర్వమైన ప్రజాదరణ, జనసంద్రం, నీరాజనాలు అంటే!

అయినా జగన్‌ నేడు ఉత్తరాంధ్రా… కనీసం శ్రీకాకుళం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు వచ్చారా? ఓ కేసులో జైల్లో ఉన్న తన వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ని పరామర్శించడం కోసమే కదా? మరి ఉత్తరాంధ్రా ప్రజలు ఎందుకు పోటెత్తుతారు?

రాజకీయ సభలకు, ర్యాలీలకు జనాలు ఫ్రీగా వచ్చే రోజులు ఎప్పుడో పోయాయనే సంగతి జనం కంటే నేతలకే బాగా తెలుసు. అయినా వాపు, బలుపు ఒకటేనంటే నమ్మేస్తారా?

ADVERTISEMENT
Latest Stories