విద్యావ్యవస్థపై జగన్ ప్రభుత్వం మరో ప్రయోగం… రెడీయా?

Jagananna Animutyalu In Vijayawadaఇస్రో శాస్త్రవేత్తలు ఏడాదికో మూడో నాలుగో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నట్లు, ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా విద్యావ్యవస్థ మీద నాలుగేళ్లుగా రకరకలా ప్రయోగాలు చేస్తూ ఆణిముత్యాలను, జాతిరత్నాలను వెలికితీస్తోంది.

ఈరోజు విజయవాడలో ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులు కూడా భవిష్యత్‌లో అంతర్జాతీయస్థాయిలో రాణించాలనే ఆలోచనతో అంతర్జాతీయ స్థాయిలోని “బాకలారియెట్ విద్యా విధానాన్ని” ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు.

నాడు-నేడు ప్రయోగం:

కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు కూడా జగన్ ప్రభుత్వాన్ని అభినందించారు. కానీ ఆ తర్వాత నుంచే అసలు కధ మొదలైంది. వాటిలో అనేక పాఠశాలలను విలీనం చేసింది. ప్రభుత్వానికి అటువంటి ఆలోచన ముందే ఉన్నప్పుడు నిరుపయోగంగా మారబోయే పాఠశాలలపై నాడు-నేడు అంటూ వందల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు?

ఇంగ్లీష్ మీడియం, బైజూస్, టోఫెల్, బాకలారియెట్:

ఇంగ్లీషు మీడియంలో చదువుకొంటేనే విద్యార్థులకు భవిష్యత్‌ ఉంటుందనే మరో వెర్రి ఆలోచనతో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తోంది. ఇది సరిపోదన్నట్లు బైజూస్ విద్యావిధానంతో ఆన్‌లైన్‌లో పాఠాలు, వాటి కోసం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టాబ్లెట్స్ పంపిణీ చేసింది. దీని కోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేసింది.

ఇంగ్లీషు మీడియంతో, బైజూస్‌తో విద్యార్థులు రాణించలేరని ప్రభుత్వం భావించిందో ఏమో, ‘టోఫెల్’ శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు టోఫెల్ కూడా సరిపోదనుకొన్నారో ఏమో ఇప్పుడు బాకలారియెట్ విద్యా విధానం అంటున్నారు.

ఆణి ముత్యాలకు జగనన్న బ్రాండింగ్… అవసరమా?

ఈ నాలుగేళ్ళలో విద్యావ్యవస్థపై చేసిన ప్రయోగాలే బెడిసికొడుతున్నప్పుడు మళ్ళీ ఇంకో ప్రయోగం అవసరమా?మన విద్యావ్యవస్థ ఆణిముత్యాలను వెలికితీయాలి అది ప్రభుత్వం బాధ్యత. కానీ వారిపై కూడా ‘జగనన్న స్టాంప్’ వేసుకోవడం దేనికి?జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వలననే వారు ఆణిముత్యాలయ్యారు కనుక వారు ‘జగనన్న ఆణిముత్యాలు’ అంటే తప్పేమిటి? అని సమర్ధించుకోవచ్చు. ఏపీలో ప్రతీ ఇంటికీ మేలు చేశామని జగనన్న చెపుతున్నారు కనుక రాష్ట్రంలో పుట్టిన బిడ్డలందరికీ తప్పనిసరిగా జగనన్న పేరు పెట్టుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేస్తుందేమో?

ADVERTISEMENT
Latest Stories