కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ఏపీలో కూడా కాక్రోచ్ లు రోడ్ల మీదకు వస్తాయని, తానూ కూడా ఒక కాక్రోచ్ నే అంటూ తాజాగా జగన్ తన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల విజయం పై తిరుపతిలో “గెలుపు సంబరాలు” చేసుకుంటుంటే వైసీపీ తన ఓటమికి “CBN రెండేళ్ల వెన్నుపోటు” అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరశన ర్యాలీలు నిర్వహిస్తుంది.
అయితే ఇందులో భాగంగా కొందరు వైసీపీ నేతలు రోడ్ల మీదకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పై, ఉప ముఖ్యమంత్రి పవన్ పై మంత్రి లోకేష్ పై, మంత్రి సవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అందులో మొదటగా వైసీపీ మహిళా నేత ఉష శ్రీ చరణ్ మంత్రి సవిత పై రెచ్చిపోయారు.
సత్యసాయి జిల్లా పెనుకొండ లో YCP నేతలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఉష శ్రీ మంత్రి సవిత ని ఉద్దేశించి ‘నీ అబ్బా జాగీరా’.? సొంత తల్లికి అన్నం పెట్టలేని నువ్వు అన్నపూర్ణ క్యాంటిన్ పెడతావా.? సొంత మామను వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి దక్కించుకున్న నువ్వు జగన్ పై విమర్శలు చేస్తావా.?
అసలు జగన్ ను విమర్శించేందుకు నువ్వెవరు.? నీ స్థాయి ఏంటి.? పెనుకొండలో బెల్ట్ షాపులకు అనుమతులిస్తూ ప్రతి లిక్కర్ బాటిల్ పై 10 రూ. తింటున్నావ్, తాగుతున్నావ్, అసలు నీకు సిగ్గు లేదా.? నిన్ను నమ్మి నీ వెంట నడిచిన వారిని దగా చేసి నట్టేట ముంచావ్, నువ్వా జగన్ గురించి మాట్లాడేది అంటూ ఉష శ్రీ వైసీపీ సంస్కారవంతమైన భాష మాట్లాడారు.
ఇక వైసీపీ కాపు టైగర్ అంబటి రాంబాబు సైతం మరోసారి ముఖ్యమంత్రి బాబు పై నోరుపారేసుకున్నారు. గుంటూరు లో అంబటి నేతృత్వంలో వైసీపీ నిర్వహించిన నిరశన ర్యాలీలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీ లో పోలీసులకు తనకు మధ్య జరిగిన వివాదంలో సీఎం చంద్రబాబు ను ఉద్దేశించి ‘వాడిని ఎప్పుడో తగలేశారు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇక నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ‘పరమచెత్త’ అని, పవన్ నువ్వు ఓజీ కాదు పెద్ద క్యాబేజి అంటూ వ్యాఖ్యానిస్తూ లోకేష్ విద్యా శాఖకు పట్టిన ‘శని’ అంటూ రెచ్చిపోయారు. ఒక మాజీ మంత్రిగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులుగా వీరు విమర్శల పేరుతో వాడుతున్న భాష, ప్రశ్నిస్తున్నాం అంటూ చేస్తున్న రాజకీయం కాక్రోచ్ల రాజకీయమా.?
దీనితో నిన్న జగన్ ప్రెస్ మీట్ లో చెప్పిన కాక్రోచ్ లు వీరేనా అంటూ సోషల్ మీడియాలో ఉష శ్రీ చరణ్, అంబటి రాంబాబు, రోజా పై కామెంట్స్ మొదలయ్యాయి. నాయకుల ముసుగులో పార్టీ కండువాలు కప్పుకుని రోడ్ల మీదకొచ్చి ఇలా బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతల మీద నోరు జారే నేతలేనా వైసీపీ కాక్రోచ్ లు.? ఇటువంటి రెచ్చకొట్టే రాజకీయం చేసే వారినేనా నేటితరం జెన్ జీ లు కోరుకుంటుంది.?
అయితే ఉష శ్రీ, కానీ అంబటి కానీ, రోజా కానీ మరెవరైనా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు, మంత్రుల పై రాజకీయ విమర్శలు చేయడం నేరం కాదు. కానీ ఆ ప్రశ్నించే విధానం, విమర్శించే భాషే ఇక్కడ అభ్యంతరకరంగా మారుతుంది. వీటి ఫలితంగానే వైసీపీ ఇప్పటికే రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించింది. అయినా ఇప్పటికి తప్పును సరిచేసుకోలేకపోతుంది.
ఒకరు తగ్గితే మరొకరు, ఒకరు కంట్రోల్ లో ఉంటే ఇంకొకరు అన్నట్టుగా కొడాలి నుంచి రోజా, అంబటి, పేర్ని…ఇక ఇప్పుడు ఉష శ్రీ ఇలా వైసీపీ నుంచి హద్దులు దాటి మాట్లాడే నేతలు రోజుకొకరు రోడ్ల మీదకు వస్తూనే ఉంటున్నారు. దీనితో జగన్ చెప్పిన కాక్రోచ్ లు వీరేనా అంటూ సోషల్ మీడియాలో వీరి ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారు.






