వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలో హీరో వెంకటేష్ ఆందోళన కలిగినప్పుడల్లా వెరైటీగా చిటికెలు వేస్తుంటారు. ఆ తర్వాత దానిని వరుణ్ తేజ్‌కి కూడా అలవాటు చేస్తే ఇద్దరూ కలిసి చిటికలు వేస్తుంటారు.
కానీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మాత్రం ‘ఈ ప్రపంచంలో తనంత తెలివైనది లేదని భావిస్తూ చిటికలు వేస్తుంటుంది. ముగ్గురూ చిటికలు వేశారు. కానీ ఒకరిది ఫన్ మరొకరిది ఫ్రస్ట్రేషన్.
ఇంతకీ మూడు నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలో చిటికల ప్రస్తావన దేనికంటే, ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని జగన్ కూడా ఇలాగే ‘నా పాలన బెస్ట్… స్వర్ణయుగం…’ అంటూ మెహ్రీన్ పిర్జాదాలా చిటికలు వేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
అయితే ఫ్రస్ట్రేషన్‌తో చిటికలు కూడా జగనే వేసేస్తున్నారు. కనుక జగన్ పరిస్థితి ఫన్-ఫ్రస్ట్రేషన్‌కి మద్య సాగుతోందని చెప్పవచ్చు.
‘నేను తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి అడుగు బయటపెట్టకుండా సిఎం చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టించేస్తున్నాననే భ్రమ జగన్‌కి ఆనందం (ఫన్) కలిగిస్తోంది. కానీ తాను ఊహించినదానికి భిన్నంగా, శరవేగంగా సిఎం చంద్రబాబు నాయుడు దూసుకుపోతుండటం జగన్‌కి ఆందోళన (ఫ్రస్ట్రేషన్) కలిగిస్తోంది.
కనుక జగన్ ఒకే సమయంలో రెండు భిన్నమైన భావోద్వేగాల మద్య నలిగిపోతున్నారు. వాటిని నియంత్రించుకోలేకనే ‘అందుబాటులో ఉన్న నేతలతో’ తరచూ తాడేపల్లి ప్యాలస్‌లో సమావేశాలు పెట్టుకొని చిటికలు వేస్తూ వారి చేత కూడా చిటికలు వేయిస్తున్నారు.
శంకరాభరణం లేదా మరో సినిమా పాట ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ ప్రతీరోజూ ఎవరూ వినరు. కానీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లేదా ఎంఎస్ సుబ్బలక్ష్మి భజగోవిందం లేదా భక్తి గీతాలో అయితే ఎన్నిసార్లయినా వింటాము.
ఈ చిన్న తేడాని జగన్ గమనించలేక ప్రతీరోజూ ముందుగా తన ‘స్వర్ణయుగం పాట’తో మొదలుపెట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు భజన పాటతో సమావేశం ముగిస్తుంటారు.
తనను ఇంతగా ద్వేషించే శత్రువు నోట ప్రతీరోజూ తన భజన చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టమో? అనిపిస్తుంది కదా?
తాడేపల్లి ప్యాలస్ భేటీలు ఎఫ్-2, ఎఫ్-3లకు సీక్వెల్స్ వంటివే కనుక వాటిలో ఫన్-ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంటుంది. అలాగే వాటి మద్య ఊగిసలాడుతూ జగన్ వేసే చిటికెలు కూడా వినిపిస్తుంటాయి. అవి ఏ రకం చిటికెలో అర్ధం చేసుకునే బాధ్యత జనాలదే… అంతేగా… అంతేగా!




