వైసీపీ అధినేత జగన్ ఈరోజు రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్కం టాకూర్ జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ “రాహుల్ గాంధీ చాలా ధైర్యంగా మోడీ, అమిత్ షాల అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నారు. జగన్‌లాగ మోడీకి విధేయంగా లేరు. ఏపీలో ఓట్లు తారుమారు అవుతున్నాయని జగన్ భావిస్తున్నట్లయితే, ఈ అంశంపై జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షాలతో పోరాడుతున్న రాహుల్ గాంధీ కి సంఘీభావం తెలిపి ఉండాలి కదా? కానీ మోడీకి భయపడుతున్నారు కనుకనే మౌనంగా ఉండిపోయారు.
రాహుల్ గాంధీ-చంద్రబాబు నాయుడు మద్య హాట్ లైన్ సంభాషణలు నడుస్తున్నాయని జగన్ ఆరోపించారు. కానీ వారి మద్య కాదు… మోడీ-జగన్ మద్యనే హాట్ లైన్ సంభాషణలు నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మోడీ, అమిత్ షాల పక్షాన్న ఉన్నారని అందరికీ తెలుసు.
అలాగే జగన్ కూడా మోడీ, అమిత్ షాలతో ‘టచ్’లో ఉన్నారని అందరికీ తెలుసు ఒకవేళ కాదనుకుంటే ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో చేయబోతున్న ధర్నాలో జగన్ కూడా పాల్గొని కాంగ్రెస్‌కు సంఘీభావం, కేంద్రానికి నిరసన తెలపాలి,” అని మానిక్కం టాకూర్ జగన్‌కి సవాలు విసిరారు.
జగన్ నేటికీ మోడీ, అమిత్ షాలతో ‘టచ్’లోనే ఉన్నారని అందుకే ఏ ఒక్క కేసులో సీబీఐ, ఈడీలు జగన్‌ని టచ్ చేయడం లేదని జగన్ చెల్లి వైఎస్ షర్మిల కూడా చెప్పారుగా!
ఏది ఏమైనప్పటికీ, జగన్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, బీహార్‌లో ఓట్ల గల్లంతు గురించి మాట్లాడి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలని వాటితో చాలా తెలివిగా ముడిపెట్టి మాట్లాడానని అనుకుంటే, ఈవిదంగా బ్యాక్ ఫెయిర్ అయ్యిందేమిటి? నేరకపోయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడానని జగన్ అనుకోక తప్పదు.




