త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ‘జనసేన’ను తీసుకువస్తానంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కార్యకర్తలు, అభిమానులలో నూతన ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యంగా ఏపీకి కేంద్రం మంజూ చేయాల్సిన అంశాలపై దృష్టి పెట్టిన ‘జనసేన’ వర్గీయులు… విశాఖ వేదికగా తొలిసారిగా నిరసన గళం విప్పారు. అది కూడా ప్రధాని మోడీ దృష్టి సారించిన సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటూ తమ నిరసన తెలియజేసారు.
విశాఖపట్టణంకు రైల్వే జోన్ ను కేటాయిస్తామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గతంలో పలు సందర్భాలలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఒకానొక దశలో అయితే ఏకంగా ప్రత్యేకంగా ప్రకటించడానికి ఏపీ విచ్చేస్తున్నారన్న ప్రచారం కూడా మీడియా, రాజకీయ వర్గాల వేదికగా జరిగింది. అయితే రానూ రానూ కేంద్ర ప్రకటనలు ఉత్తుత్తి మాటలేనని స్పష్టం అయ్యింది. తాజాగా స్పెషల్ స్టేటస్, రెవిన్యూ లోటు విషయంలో చేతులెత్తేసిన కేంద్రం, రైల్వే జోన్ విషయంలో కూడా ఇలాంటి ప్రకటన రాక ముందే ‘జనసేన’ సభ్యులు అలెర్ట్ అయ్యారు.
కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, ప్రధాని మోడీలను టార్గెట్ చేసుకుని దేశవ్యాప్తంగా ట్విట్టర్లో ట్రెండ్ కు సోషల్ మీడియాలో శ్రీకారం చుట్టగా, స్థానికంగానూ రోడ్లపైకి వచ్చి విశాఖకు వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ కాక ముందే స్వచ్చంధంగా అభిమానులు, కార్యకర్తలు పార్టీ తరపున పనులు చేపట్టడం విశేషం. అయితే దీనిని ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మాత్రం పార్టీ అధినేతపై ఉంటుంది.



