జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ప్రకటనలు, అభిమానుల హంగామా చూసి వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అదో పెద్ద డ్రామా అంటూ ఆయన పర్యటనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే వైసీపీలో కాపు మంత్రులతో ఆయనపై ఎదురుదాడి చేయించడం చూస్తే, వైసీపీ ఎంతగా ఆందోళన చెందుతోందో అర్దమవుతుంది. వారినే కాదు… పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మ, ముద్రగడ పద్మనాభంలను కూడా రంగంలో దింపి అందరిచేత పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి చేయిస్తోంది.
ఇదివరకు రెండు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన అభిమానులనే నమ్ముకొన్నారు తప్ప ప్రత్యేకంగా కాపుల మద్దతు కోరలేదు. దాని వలన చాలా నష్టపోయానని గ్రహించిన పవన్ కళ్యాణ్ ఈసారి ప్రత్యేకంగా కాపు కులపెద్దలతో సమావేశమవుతూ వారి మద్దతు కోరుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం అవడం గమనిస్తే బహుశః ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని స్పష్టమవుతోంది.
ఉభయ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. కానీ ఇదివరకు వారిలో యువత మాత్రమే పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడేవారు. కానీ ఈసారి వారాహి యాత్రతో సీన్ పూర్తిగా మారిపోయేలా ఉంది. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గంలో అందరినీ ఏకం చేసి ఒక్క తాటిపైకి తీసుకువస్తున్నారు. ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అందుకే కాపు ఉద్యమాల నుంచి రిటైర్ అయ్యానని ప్రకటించిన ముద్రగడ పద్మనాభంని మళ్ళీ రంగంలో దింపి, ఆయన చేత లేఖాస్త్రాలు సందింపజేస్తూ కాపు సామాజికవర్గంలో చీలికలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ కాపులలో చీలికలు తెచ్చి తన ఓటు బ్యాంక్ కాదుకోవాలని ప్రయత్నిస్తుంటే, పవన్ కళ్యాణ్ కాపులను మిగిలిన కులాలను కలిపి అధికారం సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన మాటలు చేతలతో స్పష్టం అవుతోంది.
వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వారాహి యాత్రకు మంచి స్పందన వస్తుండటంతో మళ్ళీ అమ్ములపొదిలో నుంచి తుప్పు పట్టిపోయిన ‘దత్తపుత్రుడు అస్త్రాన్ని’ బయటకు తీసి ప్రయోగించడం మొదలుపెట్టింది.
పవన్ కళ్యాణ్ తాను ముఖ్యమంత్రిని అవ్వాలని కోరుకొంటున్నానని విస్పష్టంగా చెపుతుంటే, చంద్రబాబు సూచన మేరకు ఆయనని ముఖ్యమంత్రిగా చేసేందుకే పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారంటూ వైసీపీలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు వాదిస్తోంది.
వైసీపీ నేతల విమర్శలకు పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గానే సమాధానం చెప్పారు. “ఒక్క చోట కూడా గెలవలేకపోయిన నన్ను చూసి ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు?నేనేం పీకలేనని మీరే అన్నారుగా?” అంటూ వారి భాషలోనే ఘాటుగా జవాబు చెప్పారు. కానీ ఆందోళనలో ఉన్న వారి నోళ్ళు మూతపడటం లేదు. అందుకు పవన్ కళ్యాణ్‌ను తప్పు పట్టలేము కదా?వైసీపీ నేతల స్పందన చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం అయ్యిందని స్పష్టం అవుతోంది.



