పవన్ ప్రెస్‌మీట్‌ పెడితేనే అంత హీట్… పార్టీ కార్యాలయమంటే..

Pawan Kalyan at the inauguration of Janasena’s Telangana office in Hyderabad.

ఈ నెల 2న పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడితే తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంత ఘాటుగా స్పందించాయో అందరం చూశాము. దేశంలో ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చునంటూనే తెలంగాణలో అవసరమా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

జనసేనాని చెప్పినట్లుగానే తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో మల్కంచెరువు సమీపంలో మణికొండ వద్ద జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

ADVERTISEMENT

రేపు ఉదయం 11.08 గంటలకు మణికొండలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగబోతోంది. కనుక తెలంగాణలోని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు వచ్చి పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది.

తెలంగాణలో జనసేన యాక్టివ్ అయితే అక్కడి పార్టీలకు ఓ విధంగా లాభం మరోవిధంగా కాస్త నష్టం ఉండవచ్చు. లాభం ఏవిధంగానంటే, “ఆంధ్రా పాలకులు ప్రజాస్వామ్యం ముసుగులో మళ్ళీ తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు, రాష్ట్రాన్ని దోచుకునేందుకు వస్తున్నారని” దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ రగిలించి లాభాపడవచ్చు.
తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని లబ్దిపొందడంలో బీఆర్ఎస్‌ పార్టీది అందెవేసిన చెయ్యి. కనుక అది తప్పకుండా వాడుకుంటుంది. టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆ బాటలోనే సాగుతున్నారు కనుక ఆమె కూడా జనసేనని వాడుకునే ప్రయత్నం తప్పక చేస్తారు. అవి రెండు వాడుకొని రాజకీయ మైలేజ్ పొందుతుంటే కాంగ్రెస్‌ పార్టీ చేతులు ముడుచుకు చూస్తూ కూర్చోదు కనుక అది కూడా వాడుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ జనసేనని తిట్టిపోస్తుంటే దానికి ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది. కనుక పట్టించుకోకుండా ఉండాలి.

ఈ లాభనష్టాలు, రాజకీయ మైలేజ్ అన్నీ చూసుకునేలోగా తెలంగాణలో జనసేన పుంజుకోగలిగితే, అప్పుడు అది కూడా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ పార్టీల ఓట్లు చీల్చే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ విధంగా జనసేన వలన తెలంగాణలో పార్టీలకు భవిష్యత్‌లో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది.

ఒకవేళ తెలంగాణలో బిజేపి-జనసేనలు చేతులు కలిపితే, బిజేపి సాయంతో మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే బీఆర్ఎస్‌ పార్టీ కల పగటి కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, రేపు జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత మళ్ళీ తెలంగాణలో రాజకీయ పార్టీలు సెగలు కక్కవచ్చు.

ADVERTISEMENT
Latest Stories