బిజెపిలో జయసుధ… నెగ్గుకురాగలరా?

Jayasudha-BJPప్రముఖ నటి జయసుధ త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. తెలంగాణ బిజెపి చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ ఆమె నివాసానికి వెళ్ళి భేటీ అయ్యి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేసినందున రాజకీయ అనుభవం ఉంది. 2009 శాసనసభ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి గెలిచారు కనుక ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. కనుక జయసుధను బిజెపిలో చేర్చుకొని ఈసారి ముషీరాబాద్ లేదా మళ్ళీ సికింద్రాబాద్‌ నుంచే శాసనసభకు పోటీ చేయించాలని బిజెపి భావిస్తోంది.

ADVERTISEMENT

అయితే గతంలో ఆమె కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలిచినప్పటికీ, అంతర్గత రాజకీయాలను, కుమ్ములాటలను తట్టుకొని నిలబడలేక చేతులెత్తేశారు. కనీసం తన నియోజకవర్గంలో ఆమె బలపడలేకపోయారు. కనుక తన నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేయలేకపోయారు. ఎమ్మెల్యే అవడం ఎవరికైనా చాలా సంతోషించవలసిన విషయమే కానీ జయసుధ రాజకీయ జీవితంలో అదే ఓ చేదు అనుభవంగా మిగిలిపోయింది. అందుకే ఆమె కాంగ్రెస్‌కు దూరమైపోయారు.

ఇప్పుడు మళ్ళీ ఆమె బిజెపి ద్వారా రాజకీయాలలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకొంటుండగా, బిజెపి ఆమె స్టార్ ఇమేజిని ఉపయోగించుకొని ఆ సీటు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్‌లో ఎదుర్కొన్నటువంటి సమస్యలే బిజెపిలో కూడా ఆమె కోసం సిద్దంగా ఉన్నాయి.

తెలంగాణ బిజెపిలో అంతర్గత కుమ్ములాటల వలననే పార్టీని విజయపధంలో నడిపిస్తున్న బండి సంజయ్‌ని తప్పించేసిన సంగతి తెలిసిందే. కనుక జయసుధకు ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని ఆశించలేము.

తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తన ముఖ్య అనుచరుడికి ఈసారి ముషీరాబాద్ టికెట్‌ ఇప్పించుకోవాలనుకొంటున్నారు. మరో బిజెపి సీనియర్ నేత, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన కుమార్తె విజయలక్ష్మికి ఈసారి సికింద్రాబాద్‌ టికెట్‌ ఇప్పించుకోవాలనుకొంటున్నారు. కనుక వారిరువురూ జయసుధని వ్యతిరేకించవచ్చు.

ఒకవేళ వారిద్దరిలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గి ఆమెకు సహకరించినా, అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తేనే జయసుధకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ ఆమె గెలిచి బిజెపి ఓడిపోతే ఎప్పటిలాగే ఏమీ చేయలేని ఓ ఎమ్మెల్యేగా జయసుధ మిగిలిపోవచ్చు. కనుక రాజకీయాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం మంచిదో కాదో ఆమే ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories