సినీ పరిశ్రమలో సర్వసాధారణంగా వినిపించే పదం ‘ఈగో.’ నిజానికి ఇది లేని వ్యక్తి ఉండరు గానీ, సినీ పరిశ్రమలో మాత్రం ఇది బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న “జై లవకుశ” సినిమా సెట్స్ లో కూడా ఇదే తెరపైకి వచ్చింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తుండగా, ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సి.కే.మురళీధరన్ అందుకున్నారు.
“పీకే, 3 ఇడియట్స్, మొహింజోదారో, లగే రహో మున్నాభాయ్” వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులను నిర్వహించిన మురళీధరన్ కు – ‘జై లవకుశ’ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలతో, అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో ఈ స్థానంలో టాలీవుడ్ ఏస్ కెమెరామెన్ చోటా కే నాయుడును తీసుకున్నారు. ఈ మార్పుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. సెట్స్ లో తలెత్తిన ఈగో వలనే ఈ మార్పు జరిగిందని ట్రేడ్ వర్గీయుల విశ్వసనీయ సమాచారం.
ఇక, ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి లేటెస్ట్ ఓ వార్త హల్చల్ చేస్తోంది. స్వతహాగా కూచిపూడి నృత్యం నేర్చుకున్న జూనియర్, ఈ సినిమాలో ఓ పాత్రలో అలాంటి నృత్య దర్శకుడి పాత్రను పోషిస్తున్నారని, నాటి కమల్ హాసన్ ‘సాగర సంగమం’ తర్వాత ఆ రేంజ్ లో ఉండే పాత్రగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుందనే విధంగా “జై లవకుశ” సిద్ధమవుతోందని సందడి చేస్తున్న టాక్ అభిమానులకు మాంచి ఉత్సాహాన్ని పంచుతోంది.



