రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై ఒక అవగాహనకు వస్తున్నారు.
పొత్తులో భాగంగా ఇప్పటికే రాజానగరం, రాపాక సీట్లలో జనసేన పోటీ చేయబోతుంది అంటూ ప్రకటించిన పవన్, తాజాగా రాజమండ్రి రూరల్ నుంచి కూడా వచ్చే ఎన్నికలలో జనసేన పోటీలో నిలవనుంది అంటూ తన పార్టీ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చారు.
ఈ స్థానం నుంచి జనసేన తరుపున కందుల దుర్గేష్ బరిలో దిగనున్నారని సమాచారం. కందుల దుర్గేష్ చాలా కాలం నుండి పార్టీకి, పార్టీ అధినేతకు విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేసారు. పార్టీ బలోపేతానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అంటూ ఇచ్చిన మాటకు న్యాయం చేసారు పవన్ అంటూ కందుల దుర్గేష్ నాయకత్వాన్ని బలపర్చడానికి సిద్ధమయ్యారు జనసైనికులు.
ఇదిలా ఉంటే…,ఈ నియోజకవర్గంలో టీడీపీ కూడా చాలా బలంగా ఉందనే చెప్పాలి. 2009 నుంచి ఈ నియోజకవర్గం చరిత్ర చూసుకుంటే ఇక్కడ టీడీపీ తన హావ కొనసాగుతూ వస్తుంది. ప్రజారాజ్యం సమయంలో కూడా ఇక్కడ టీడీపీ తరుపున పోటీ చేసిన చందన రమేష్ 44,617 ఓట్లతో త్రిముఖ పోటీలో దాదాపు 1500 వందల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ సమయంలో పీఆర్పీ 43070 ఓట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ 38340 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాయి.
2014 రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ప్రాబల్యాన్ని నిలబెట్టి వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు మీద 18058 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. 2019 జగన్ వేవ్ లో కూడా గోరంట్ల తన పట్టు కోల్పోకుండా త్రిముఖ పోటీలో కూడా విజయం సాధించారు. 2019 ఎన్నికలలో త్రిముఖ పోటీలో కూడా టీడీపీ అభ్యర్థి గోరంట్ల 74166 ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవగా, 63762 ఓట్లతో వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు రెండవ స్థానంలో, 42685 ఓట్లతో జనసేన తరుపున పోటీ చేసిన కందుల దుర్గేష్ నిలిచారు.
అయితే ఈ త్రిముఖ పోటీలో 10404 ఓట్ల మెజారిటీతో గోరంట్ల రాజమండ్రి రూరల్ లో మరోసారి టీడీపీ జెండా ఎగరేశారు. ఈ నేపథ్యంలో బుచ్చయ్య “పొత్తుతో ముందుకెళ్తారా..? లేక పోరుకు సిద్దమవుతారా”..? అంటే అది సందేహమే. ఇప్పటికే తన సీటు పై గట్టి పట్టుదలగా ఉన్న గోరంట్లను బాబు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతుంది.
పొత్తు ధర్మానికి కట్టుబడి టీడీపీ – జనసేన పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్ జరిగినట్లయితే ఈ కూటమి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక అనేది లెక్కలు చెపుతున్నాయి. అలాగే టీడీపీ పార్టీ నుంచి ఓట్ ట్రాన్స్ ఫర్ జరగక పోతే మాత్రం కూటమి నుంచి బరిలో దిగుతున్న జనసేన అభ్యర్థి గెలుపు కష్టసాధ్యమే. ఇరు పార్టీల ఉమ్మడి లక్ష్యం కోసం, ఇరు పార్టీల అధినేతల నిర్ణయాలను గౌరవిస్తూ స్థానిక నాయకులు ముందుకు రాగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
“పొత్తులో ఇవన్నీ కామన్ అనుకుని ముందుకెళ్ళి సరిపెట్టుకుంటారా..? అలాకాకుండా ఎవరిదారి వారిదే అన్నట్టుగా తనకు టికెట్ రాలేదని సర్దుకుంటారా”..? అనేది వేచి చూడాలి. నాయకులు చేసే మంచైనా, చెడైనా దానికి ప్రతిఫలం అనుభవించేది ఆ పార్టీ అధినేతే. ఆ విషయంలో జగన్ అయినా పవన్ అయినా, బాబు అయినా ఒక్కటే.




