నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటుంటే, పుష్కర కాలం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల విభేధాల గురించి మాట్లాడుకోవాల్సి రావడం చాలా బాధాకరమే.
నాడు తెలంగాణ సాధన కోసం ప్రజలలో చైతన్యం రగిలించేందుకే ఆంధ్రా గురించి తప్పుగా మాట్లాడానని కేసీఆరే ఒప్పుకున్నారు. నాడు కేసీఆర్ చెప్పిందే వేదం అని నమ్మి అందరూ ఆయన బాటలోనే నడిచారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విజయవంతమైన ఆ ఫార్ములాని వాడుకుంటే రాష్ట్రంలో రాజకీయంగా పైచేయి సాధించవచ్చని కేసీఆర్ గ్రహించారు. గాబట్టే పదేళ్ళ పాలనలో ఆ విద్వేషాలను అలా పెంచి పోషిస్తూనే ఉన్నారు.
ఆ పేరుతో ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ తనకు ఎదురేలేదనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎత్తుకుపై ఎత్తులు వేసి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా చావు దెబ్బ తీశారు.
ఎన్నికలలో ఆ ఫార్ములా ఫెయిల్ అయినప్పటికీ ఆంధ్రా పట్ల విద్వేషమే బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఆయుధంగా వాడుకుంటూనే ఉన్నారు.
నాడు వైఎస్ షర్మిల సొంత కుంపటి పెట్టుకొని తెలంగాణలో కాళ్ళు అరిగిపోయేలా తిరిగినట్లే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో ఆమెను పట్టించుకునే నాధుడే లేడు!
అధికార కాంగ్రెస్, బిజేపిలు, చివరికి ఆమె తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు.
టీఆర్ఎస్ పేరుని హైజాక్ చేసి పార్టీ పెట్టగానే బీఆర్ఎస్ నేతలు క్యూకడతారనుకుంటే, మునిగిపోతున్న నౌక వంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరూ ఆమె పార్టీలో చేరేందుకు ఇష్టపడటం లేదంటే ఆమె పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
షర్మిల అదృష్టం బాగుంది గాబట్టి తంతే బూరెల గంపలో పడ్డారు. కానీ కవితకు అంత అదృష్టం లేదు. అటువంటి ఆప్షన్ కూడా లేదు.
కనుక పార్టీ పెట్టిన రెండు నెలలకే మనుగడ కోసం తండ్రి కనిపెట్టిన సక్సస్ ఫార్ములాని అందిపుచ్చుకున్నట్లున్నారు. ఆంధ్రా పట్ల విద్వేషం వెళ్ళగక్కుతూ, ఆంధ్రా పాలకులను, పార్టీలను తెలంగాణని దోచుకోవడానికి వస్తున్న బూచిగా చూపించే ప్రయత్నం చేశారు.
తద్వారా ఆమె తెలంగాణవాదుల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నారు. లేకున్నా తాను చేసిన ఆ అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రా పాలకులు, పార్టీలు, కనీసం… వాటి మద్దతుదారులు తనపై విరుచుకుపడతారని, అప్పుడైనా ‘తెలంగాణ ఆడబిడ్డపై ఆంద్రుల దాడి’ అంటూ చెప్పుకొని సానుభూతి ఎంతో కొంత రాజకీయ మైలేజ్ పొందవచ్చునని ఆమె ఆలోచన కావచ్చు.
ఒంటి చేత్తో చప్పట్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ గ్రహించింది కానీ ఆమె ఇంకా గ్రహించినట్లు లేదు. బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నా, విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం మౌనం వహించడానికి కారణం చాతకానితనం కాదు.
మాటకు మాట బదులివ్వడం మొదలుపెడితే బీఆర్ఎస్ పార్టీకి ఆయుధాలు తయారు చేసి అందించినట్లే అవుతుంది. వాటితో సెంటిమెంట్ రాజేసుకోని తెలంగాణలో బలపడుతుంది. కనుక దానికి మనమెందుకు ఇవ్వడమని మౌనం వహిస్తున్నారు.
కనుక కూటమి మౌనం ఓ వ్యూహమే కానీ మౌనంగా ఉండిపోవడం దాని బలహీనతగా భావించి బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు రెచ్చిపోతూనే ఉంటాయి.
బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన ఈ పద్మవ్యూహం గురించి సిఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కనుక దానిని బ్రేక్ చేసేందుకు చాలా ప్రయత్నించారు. కానీ చేధించలేకపోయారు. కనుక కాంగ్రెస్ మంత్రులు కూడా దానిలోనే చిక్కుకొని దానిలోనే తిరుగుతున్నారు.
అందుకే కాంగ్రెస్ నేతలు కూడా నదీ జలాలు, ప్రాజెక్టులు మొదలు నేడు జరగాల్సిన జనసేన పార్టీ సమావేశం వరకు బీఆర్ఎస్ ప్రభావంతో దాని భాషలోనే మాట్లాడుతున్నారు.
కానీ వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలన్నీ బిజేపి పద్మవ్యూహంలో చిక్కుకుపోయి అస్తిత్వం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని!




