మార్చి నెల 15 వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత కు ఆ కేసులో ఇప్పటికి బెయిలు దొరకలేదు. అనేక కారణాలతో కవిత పలుమార్లు బెయిలు కోసం కోర్ట్ తలుపు తట్టినప్పటికీ ఆమె పిటిషన్ పై రిమాండ్ కొనసాగింపు అంటూ తీర్పు ప్రకటిస్తూనే ఉంది న్యాయస్థానం.
గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం మే 20 వరకు కవిత జ్యూడిషల్ కస్టడీ ని పొడిగిస్తూ తీర్పు ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అయితే ఈ కేసులో ఏదైనా అద్భుతం జరిగి కవిత బెయిలు మీద బయటకు వస్తారు అని ఎదురు చూసిన బిఆర్ఎస్ పార్టీ నేతలకు, ఆమె కుటుంబ సభ్యులకు మరోసారి ఎదురు దెబ్బే తగిలింది.
జూన్ 3 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని మరోసారి పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ రెవిన్యూ కోర్ట్ న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేసారు. అయితే దాదాపు రెండు నెలల నుంచి కవిత తీహార్ జైల్లో గడుపుతున్నారు. కవిత అరెస్టు తరువాత తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తంతు కూడా పూర్తయిపోయాయి. అలాగే ఆమె రిమాండ్ ముగిసే సరికి దాదాపుగా ఎన్నికల ఫలితాలు కూడా ఖరారైపోతాయి.
జూన్ 3 న కవిత భవిష్యత్తు మరోసారి కస్టడీలోనా, లేక బెయిలా? అనేది తేలనుంది. అలాగే జూన్ 4 న కౌంటింగ్ డే కావడంతో తెలంగాణ రాజకీయాలలో బిఆర్ఎస్ భవితవ్యం ప్రజలలోనా? ఫామ్ హౌస్ లోనా? అనేది తేలనుంది. అయితే కవిత తరువాత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కెజ్రీవాల్ కు ఈ కేసులో బెయిలు రావడం ఆయన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ని టార్గెట్ చేస్తూ దూసుకుపోవడం జరిగిపోయింది.
అయినా కవిత మాత్రం తీహార్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా మిగిలిపోయారు. దీనితో కవిత రిమాండ్ కొనసాగింపు ఒక సీరియల్ లా సాగుతూనే ఉంది అంటూ నిట్టూరుస్తున్నారు బిఆర్ఎస్ శ్రేణులు. అలాగే కేంద్ర రాజకీయాలను గడగడలాడించగల ధీరుడు, సురుడు కేసీఆర్ అంటూ ఎలివేషన్లు ఇచ్చిన బిఆర్ఎస్ నాయకుల దృష్టిలో కేసీఆర్ సొంత కూతురు కవిత కేసు విషయంలో ఎం చేయలేక చేతులెత్తేసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిలా మిగిలిపోయారు.




