తండ్రి, అన్న నడిపిస్తున్న గులాబీ కారులో నుంచి కల్వకుంట్ల కవిత దిగిపోయిన తర్వాత చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని వారాలుగా ఆమె పూర్తి ‘సైలంట్ మోడ్’లో ఉంటున్నారు. ఒకవేళ మీడియా ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారే తప్ప బీఆర్ఎస్ పార్టీ జోలికి వెళ్ళడం లేదు.
తెలంగాణ రాజకీయాలలో తన సత్తా నిరూపించుకునేందుకు ఆమెకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో గొప్ప అవకాశం లభించింది. ఆమె అభ్యర్ధిని బరిలో దించి గెలవకపోయినా ఓట్లు చీల్చి బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకోవచ్చు.
కానీ ఆమె జాగృతి, మీడియా సమావేశాలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి లాభం కలిగించలేకపోయినా కనీసం తన వలన నష్టం కలగకుండా దూరంగా ఉంటున్నారన్న మాట!
బహుశః ఎప్పటికైనా తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ నుంచి పిలుపు వస్తుందని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరుకోవచ్చనే ఆశతోనే కల్వకుంట్ల కవిత ‘న్యూట్రల్’గా ఉంటున్నారేమో? ఒకవేళ ఆమె మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లయితే, తెలంగాణ జాగృతిలో జిల్లా శాఖలు, వాటికి ఇన్‌ఛార్జ్ నియామకాలు, పత్రాలు దేనికో?
ఇది వరకు తెలంగాణలో జగన్, షర్మిల రాజకీయాలు చేస్తున్నప్పుడు అనేక మంది నాయకులు, కార్యకర్తలు వారిని నమ్ముకొని వెంట తిరిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.
ఇప్పుడు తెలంగాణ జాగృతి… అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని నమ్ముకున్నవారి పరిస్థితి కూడా భవిష్యత్తులో ఇలాగే ఉండబోతోందా?అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుంది.




