
‘నువ్వొస్తానంటే నే వద్దంటానా?’ అనే సినిమా పాట ఎప్పుడో అప్పుడో వినబడుతూనే ఉంటుంది. కానీ ‘మేము రమ్మంటున్నా రానంటావే’ అనే పాట మాత్రం మన ఏపీ ప్రభుత్వంలో అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది.
గతంలో జగన్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన ఆంధ్రాకు తరలి రమ్మనమని ఆదేశిస్తే, చిరంజీవితో సహా అందరూ చేతులు జోడించి దణ్ణం పెట్టి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా హైదరాబాద్ పారిపోయారు. అంతటితో ఆ పాట ఆగిపోయింది.
ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆ పాట వినిబడుతోంది. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముగ్గురూ కూడా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి రావాలని కోరుతున్నారు.
వారితో తెలుగు సినీ పరిశ్రమకు ఎంత బలమైన అనుబంధం ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇద్దరు మెగా బ్రదర్స్ అధికారంలో, అధికార పార్టీలో ఉన్నారు. అయినా సినీ పరిశ్రమ ఏపీకి తరలివస్తామని చెప్పడం లేదు!
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
కనుక మంత్రి కందుల దుర్గేష్ మళ్ళీ మరోసారి తెలుగు సినీ పరిశ్రమని ఏపీకి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. వస్తే స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లకు భూములు ఇస్తామని, అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఆంధ్రాలో సినిమా షూటింగ్‌లు చేసినా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు.
పుష్ప-2, సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, సినీ ప్రముఖుల పరామర్శలు, ప్రెస్‌మీట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మద్య గ్యాప్ వచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రాలో ఇంత స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంది. కనుక సినీ పరిశ్రమ ఏపీకి తరలివచ్చేయవచ్చు. కానీ రాకపోవచ్చు. ఎందువల్ల అంటే ‘జగన్ ఫోబియా’ వల్లనే.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
“మళ్ళీ నేనే వస్తా.. ఈసారి 25-30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలుతా” అని జగన్ పదేపదే చెపుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితులలో రాలేరని కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్పడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.
కనుక ‘మళ్ళీ జగన్ వస్తే..’ అనే భయంతోనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు భయపడుతున్నారు.
సరిగ్గా ఇదేవిదంగా తెలుగు సినీ పరిశ్రమ కూడా భయపడుతోంది. కనుక దానిని రప్పించడానికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే సరిపోదు. వారిలో జగన్ ఫోబియా పోగొట్టాలి. అప్పుడే ఆంధ్రాకు రమ్మనమని పిలిస్తే ఆలోచిస్తారు. లేకుంటే ‘మేము రమ్మంటున్నా రానంటావే’ అనే పాట పాడుకుంటూ కాలక్షేపం చేయాల్సిందే!