తాను ఎంతగానో ప్రేమించే తన పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి చర్యల వలన తదుపరి ఎన్నికలలో ఓటమి పాలవుతుందన్న ఆవేదనను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యక్తపరిచారు. ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమం పార్ట్ 2లో భాగంగా ప్రసారమైన కధనంలో తన పార్టీ ఎలా ఓటమి పాలవుతుందో లెక్కలతో సహా వివరించారు ఆర్ఆర్ఆర్.
మా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పధకాలలో ‘వన్ టైం సెటిల్మెంట్’ పధకం అత్యంత దారుణమైన పధకమని అభిప్రాయపడ్డ రాజు గారు, నిజంగా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఏళ్ళ తరబడి ఉంటున్న వాళ్ళు ఈ పధకానికి డబ్బులు కట్టడం లేదని, ఖాళీగా ఉన్న ఇళ్లను తమ పేర్లతో రాయించుకోవడానికి ఈ పధకం ఉపయోగ పడుతోందని, వాళ్ళే డబ్బులు కడుతున్నారని అన్నారు.
మొత్తం 50 లక్షల గృహాలు అని ప్రభుత్వం అంచనా వేస్తోందని, ఈ 50 లక్షల గృహాలలో సరాసరి ఇంటికి ఇద్దరు చొప్పున వేసుకున్నా కోటి ఓట్లు ఖచ్చితంగా మా పార్టీకి పడవని, ఇది నిస్సందేహంగా జరుగుతుందని, గత ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీకి మా పార్టీకి మధ్య వ్యత్యాసం 30 లక్షల ఓట్లు మాత్రమేనని, అందుకే ఈ ఓటీఎస్ పధకం మా పార్టీకి అత్యంత చరమగీతం పాడేలా ఉందని అన్నారు.
నిజానికి ఎన్నికలకు ముందు ఉచితంగా దీనిని చేసి ఇస్తామని మా చేత కూడా పబ్లిసిటీ చేయించారని, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారని నైరాశ్యత వ్యక్తం చేసారు. అలాగే ఉద్యోగస్తులు 10 లక్షలకు పై చిలుకు ఉన్నారని, ఇందులో ఓ రెండు, మూడు లక్షల కుటుంబాల ఓట్లు మా పార్టీపై ఉన్న అభిమానంతో పడొచ్చు, ఇక మిగిలిన 8 లక్షలలో సరాసరి ఇంటికి నలుగురు చొప్పున వేసుకున్నా, 32 లక్షలు ఓట్లు మా పార్టీకి పడవని అన్నారు.
మొత్తంగా ఒక కోటి 30 లక్షల ఓట్లు 2019 నుండి ఇప్పటివరకు ఖచ్చితంగా కోల్పోయామని, మా ముఖ్యమంత్రి పనితీరుతో ఇంకెన్ని కోల్పోవలసి వస్తుందోనన్న ఆవేదనను వెలిబుచ్చారు. మొత్తంగా 2024లో తాను ఎంతగానో ప్రేమించే పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యంగా కనపడుతోందని, అసలు ఈ మధ్యలోనే ఎన్ని జరుగుతాయో వేచిచూడాలని అన్నారు.



