తనను కలిసిన కాపు నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ తో ఫోన్ లో మాట్లాడించారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు. హైదరాబాద్ కు వచ్చిన పద్మనాభం, కాపు ఉద్యమానికి మద్దతు తెలిపిన మాజీ మంత్రులు చిరంజీవి, దాసరి తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ఆదివారం నాడు పళ్లంరాజు ఇంటికి వెళ్లి కలిసిన సమయంలో పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన పళ్లంరాజు, ముద్రగడకు ఇచ్చి మాట్లాడాలని కోరగా, కాపుల భవిష్యత్తు కోసం తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతివ్వాలని పవన్ ను కోరినట్టు సమాచారం.
అయితే దీనిపై పవన్ ఎలా స్పందించారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించిన తొలినాళ్ళల్లో తనకు కాపు సంఘం వాళ్ళ మద్దతు అవసరం లేదని, అలాంటి కుల రాజకీయాలకు తానూ వ్యతిరేకమని పవన్ ఓ స్పష్టమైన ప్రకటన చేసి సంచలనం సృష్టించాడు. అలాగే తుని ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు గానీ, ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించలేదు అన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇలాంటి తరుణంలో కాపు రిజర్వేషన్లు కోసం మద్దతు తెలుపుతారా? అన్న విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే తన సోదరుడు చిరంజీవి ఈ దిశగా మీడియా ముఖంగా ఒక ప్రకటన చేయడంతో, ప్రస్తుతం తమ్ముడు స్పందన కోసం పొలిటికల్ వర్గాలు వేచిచూస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల మించిన అవసరాలు చాలా ఉండడంతో వాటిని పక్కన పెట్టి, ముద్రగడకు మద్దతు ప్రకటిస్తే… కుల రాజకీయాల రొచ్చులోకి ‘జనసేన’ అధినేత పవన్ కూడా ఇరుక్కున్నట్టే అన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. గతంలో ఈ దిశగా ప్రకటన చేసినప్పటికీ, ప్రస్తుతం ముద్రగడ మద్దతు కోరిన నేపధ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



