తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితి గురించి చంద్రబాబు నాయుడుకి వివరించాను. తెలంగాణలో 87 స్థానాలలో టిడిపి బలంగా ఉంది కనుక ఈసారి తప్పకుండా శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఆమోదించిన తర్వాత పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాం. ఏపీలో మా పార్టీతో జనసేన కలిసి పోటీ చేస్తున్నందున, తెలంగాణలో కూడా కలిసి పోటీ చేయాలనుకొంటే మేము సిద్దంగా ఉన్నాము. దీని గురించి త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాము,” అని చెప్పారు.
తెలంగాణలో టిడిపి సమూలంగా తుడిచిపెట్టుకుపోయిందని అందరూ భావిస్తుండగా, కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభకు లక్షమందికిపైగా పాల్గొన్నారు. తెలంగాణ టిడిపి 87 స్థానాల నుంచి పోటీకి సిద్దపడుతుంటం గమనిస్తే కేవలం ఆంద్రా సెటిలర్స్ ఓట్లనే నమ్ముకోవడం లేదని, నేటికీ తెలంగాణలో టిడిపికి బలం ఉందని అర్దమవుతోంది.
ఇక జనసేన విషయానికి వస్తే, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో సహా పలు జిల్లాలలో 32 స్థానాలకు పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కనుక ఒకవేళ తెలంగాణలో కూడా టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తాయా లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. నామినేషన్స్ వేసేందుకు నవంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు గడువు ఉంది. కనుక తెలంగాణ టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేయాలనుకొంటే తక్షణం సీట్ల సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను ప్రకటిచాల్సి ఉంది.
ఇప్పటికే బిఆర్ఎస్ 115 మంది, కాంగ్రెస్ 55 మంది, బీఎస్పీ 20 మంది అభ్యర్ధులను ప్రకటించాయి. నేడో రేపో బీజేపీ కూడా ప్రకటించబోతోంది.



