మార్చి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమాలో మూడవ పాట విడుదలైంది. ఇంతకు ముందు విడుదలైన రెండు పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా… మూడవ పాట మాత్రం ఫస్ట్ టైం వినగానే సంగీత, సాహిత్య ప్రియులను ఆకట్టుకుంటుంది. డ్యూయెట్ పాటలను ఆహ్లాదకరంగా అందించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన సంగీత దర్శకుడు అనూప్ బాణీలలో చెప్పుకోదగినదిగా ఈ “ఏమో ఏమో” పాట నిలుస్తుందని చెప్పవచ్చు.
ఈ పాటకు మరొక ప్రత్యేకత గాయనిగాయకులని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆలపించిన ఆర్మన్ మాలిక్ వాయిస్ కాస్త కొత్తగా ఉండగా, మెలోడీలతో మైమరిపించే స్వరం సొంతం చేసుకున్న శ్రేయా ఘోషల్ గానం వినసొంపుగా ఉన్నాయి. ఇక ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. విదేశీ లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా బాగుంటుందన్న నమ్మకాన్ని లిరికల్ వీడియో స్పష్టం చేసింది. డాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మించారు.
ఇదిలా ఉంటే, 18వ తేదీన జరగబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ ప్రత్యేక అతిథి హాజరు కానున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ కేవలం పాటల విడుదల ద్వారానే జరుగుతుండగా, ప్రీ రిలీజ్ రోజున అభిమానులంతా ఎదురుచూస్తున్న ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్ మీడియాలతో చిత్ర యూనిట్ వర్గాల ఇంటర్వ్యూలతో ఒక వారం రోజుల పాటు పబ్లిసిటీ హోరెత్తనుంది.



