జగనన్న పసుపు చీర… రామన్న మర్యాద!

Kavitha and Sharmila in political conflict with brothers and parties in Telangana

అది యాదృచ్చికమో… దురదృష్టమో తెలీదు కానీ కేసీఆర్‌ కుటుంబంలో కవిత, జగన్‌ కుటుంబంలో షర్మిల ఇద్దరూ సొంత పార్టీల కోసం ఎంతగానో కష్టపడి పనిచేసి చివరికి బయటకు వెళ్ళాల్సివచ్చింది. వారి రాజకీయ భవిష్యత్ ఏవిదంగా ఉంటుందో ఇప్పుడే ఊహించడం కష్టమే.

కానీ ప్రస్తుతం ఇద్దరు చెల్లెమ్మలు ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇద్దరూ తమ సొంత అన్నలు, పార్టీ నేతలతోనే ఇప్పుడు యుద్ధాలు కూడా చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ విషయంలో జగనన్ని వేలెత్తి చూపేందుకు షర్మిల వద్ద అనేక బలమైన కారణాలున్నాయి కనుక విమర్శిస్తున్నారు. వాటి వలన వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు నష్టం కలుగుతుంది కనుక జగన్‌ కూడా చెల్లిపై ఎదురుదాడి చేశారు. చేయించారు.

కవిత ఇటీవలే పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. కనుక రాబోయే రోజుల్లో ఆమెకూ, బీఆర్ఎస్‌ పార్టీకి మద్య చిన్న చిన్న యుద్ధాలు అనివార్యమే.

షర్మిల వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉంది కానీ కవిత వెనుక ఎవరూ లేరు. కనుక బీఆర్ఎస్‌ పార్టీతో యుద్ధాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటే ఆమె తన ఉనికిని చాటుకోగలరేమో కానీ రాజకీయంగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది.

కనుక త్వరలో జరుగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై దృష్టి పెట్టి తెలంగాణ రాజకీయాలలో నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు.

ఆమె చేసిన తీవ్ర విమర్శలు, ఆరోపణల వలన బీఆర్ఎస్‌ పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయత దెబ్బ తిన్నప్పటికీ, ఆమె విషయంలో రామన్న (కేటీఆర్‌) చాలా హుందాగానే వ్యవహరించారు.

తాజా మీడియా సమావేశంలో ఆమె ప్రస్తావన వచ్చినప్పుడు, “పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్నాక ఆమె విషయంలో మా పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. కనుక ఇక ఆమె గురించి మాట్లాడవలసింది ఏమీ లేదు,” అని చాలా క్లుప్తంగా, హుందాగా స్పందించారు కేటీఆర్‌.

చెల్లి విషయంలో కేటీఆర్‌ ఇంత హుందాగా స్పందించగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం ‘పసుపు చీర కట్టుకున్నావంటూ’ చెల్లి గురించి చులకనగా మాట్లాడారు. కానీ ‘పసుపు చీర’ డైలాగు బెడిసికొట్టినప్పటి నుంచి జగన్‌, వైసీపీ నేతలు ఆమె జోలికి వెళ్ళడం మానుకున్నట్లే ఉన్నారు.

కానీ అన్నలకు రాఖీలు కట్టిన ఇద్దరు చెల్లెమ్మలు, ఇప్పుడు వారికి పక్కలో బల్లేల్లా మారారు. కనుక ఆ బల్లేలు అప్పుడప్పుడు గుచుకొంటూనే ఉంటాయి. ఆ నొప్పి భరిస్తూనే ఉండాలి.

ADVERTISEMENT
Latest Stories