రాజకీయ పార్టీలలో పరస్పర విమర్శలు, ఆరోపణలు సహజమే. కానీ ఒకే కుటుంబం సభ్యులు రెండు పార్టీలుగా చీలి చేసుకున్నప్పుడే ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఏపీలో జగన్-షర్మిల, తెలంగాణలో కేటీఆర్-కవిత ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు రాఖీలు కట్టుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో గొప్పగా షేర్ చేసుకున్నవారే నేడు బద్ధ శత్రువుల్లా మారారు. అయితే ఇక్కడ చర్చ వారి రాఖీ బంధాలు, పంచాయితీల గురించి కాదు.
కేసీఆర్‌పై కాంగ్రెస్ ఈగ వాలితే తరిమికొట్టే వరకు నిద్రపోని కేటీఆర్, హరీష్ రావులు, కల్వకుంట్ల కవిత కేసీఆర్‌పై, ఆయన పాలనపై అన్ని విమర్శలు చేస్తున్నా కిక్కురుమనడం లేదు.
బీఆర్ఎస్ పార్టీకి మూల స్థంభం వంటి హరీష్ రావుని అవినీతిపరుడు, గుంట నక్క అంటూ ఆమె ఆక్షేపిస్తున్నా ఆయనతో సహా బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ కనీసం స్పందించడం లేదు!
ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వారికీ, వారి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నా మౌనంగా ఉండిపోవడం రాజకీయ భాషలో ‘సంయమనం పాటించడంగా’ లేదా ‘మా మౌనం కూడా గొప్ప వ్యూహం’ అని సర్ది చెప్పుకోవచ్చు.
కానీ ఆమెపై ఎదురుదాడి చేస్తే ప్రజలలో తమ పట్ల వ్యతిరేకత, ఆమె పట్ల సానుభూతి పెరిగితే నష్టపోతామనే భయం కావచ్చు.
లేదా ఆమెని రెచ్చగొడితే ఫామ్‌హౌసు రహస్యాలు బయటపెడతారనే భయం వల్ల కావచ్చు. కనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏ కారణంగా మౌనం వహిస్తున్నప్పటికీ, దానిని ప్రజలు బలహీనతగానే భావిస్తారు.
ఆమె కూడా ఆ ‘గులాబీ తానులో ముక్కే’ కనుక ఆమెకీ ఈ విషయం బాగా తెలుసు. అందుకే పదేపదే బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ‘కట్టప్ప’ హరీష్ రావేనని, ఏదో రోజు కేసీఆర్, కేటీఆర్‌లను నిలువునా ముంచేస్తారని కల్వకుంట్ల కవిత చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్యం దెబ్బ తినాలని హరీష్ రావు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని కవిత మరో పెద్ద బాంబు పేల్చారు.
ఆమె ఇలాంటి సంచలన ఆరోపణలు చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ స్పందించకపోవడం విచిత్రమనుకుంటే, హరీష్ రావు పేరుతో కవితే బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చేందుకు ప్రయత్నిస్తుండటం మరో విచిత్రం.
ఆమె సొంత కుంపటి పెట్టుకుని ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెంటపడాల్సిన అవసరం లేదు. కానీ పడుతున్నారు. అంటే ఏదో విధంగా హరీష్ రావుని బయటకు సాగనంపించి తాను మళ్ళీ గులాబీ గూటికి చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే ఈ గోల దేనికి?
బహుశః వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ బిజేపిలో విలీనం కావచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావచ్చునేమో?





