శాసనసభ సమావేశాలకు ముందు అధికార ప్రతిపక్ష పార్టీలు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, సభలో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకుంటాయి.
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే చేసింది. సభలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ వారికి సూచించారని మీడియాలో వార్తలు వచ్చాయి.
సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ముద్రించిన నల్ల చొక్కాలు ధరించి వచ్చారు. కనుక వారిని పోలీసులు అడ్డుకోవడం, తోపులాటలు, ఖండనలు, ఆస్పత్రిలో చికిత్సలు వగైరాలన్నీ చకచకా సాగాయి.
అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి చేసిన మార్గదర్శనం ఇదేనా? ఆయన సూచించిన వ్యూహం ఇదేనా? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయనే శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, అనుసరించాల్సిన వ్యూహాలను చెప్పారు కనుక!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ముద్రించిన టీషర్ట్స్ ధరించి వచ్చారంటే ఇది ప్రీ- ప్లాన్డ్ అని అర్ధమవుతూనే ఉంది కదా? దీనిని గొప్ప వ్యూహమని బీఆర్ఎస్ పార్టీ సమర్ధించుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ముద్రించిన టీ షర్ట్స్ ధరించి లోనికి వస్తామంటే ఏ ప్రభుత్వమైనా అంగీకరిస్తుందా? అంతెందుకు… నాడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని సచివాలయంలోనికి రానిచ్చారా?
కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకుండా కోట్లాది రూపాయలు జీతభత్యాలు తీసుకోవడమే తప్పు. పైగా శాసనసభ సమావేశాలకు వెళ్ళేవారికి ఇలాంటి ‘మార్గదర్శనం’ చెప్పడం ఇంకా తప్పు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఒకవేళ సిఎం రేవంత్ రెడ్డి వారిపై దౌర్జన్యం చేయలనుకుంటే శాసనసభ ఆవరణలో మీడియా ప్రతినిధుల ఎదుట చేయిస్తారా?ఆయన ఎవరిపై కక్ష తీర్చుకోవాలనుకుంటే వారికి, మాజీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజుకి చేసినట్లు రహస్యంగా ట్రీట్మెంట్ చేయించగలరు కదా? కానీ సిఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి లోబడి వ్యవహరిస్తున్నారు కనుకనే బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు శాసనసభ ఆవరణలో ఇంత రాద్దాంతం చేయగలిగారు.. కదా?
అదే బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నేడు మామూలు దుస్తులలో శాసనసభకి వస్తే, వారిని పోలీసులు అడ్డుకోలేదు కదా?అందరినీ సగౌరవంగా లోనికి పంపారు కదా?అంటే తప్పు ఎవరిది?
శాసనసభ సమావేశాల తొలిరోజునే ఈవిధంగా హడావుడి చేసి, నేడు సభకు వచ్చి నిన్నటి ఘటనలపై చర్చకు వాయిదా తీర్మానం కోరారు. అంటే ఇతర అంశాలపై చర్చ జరగకుండా సభలో రచ్చరచ్చ చేయడమే బీఆర్ఎస్ పార్టీ వారి వ్యూహంగా కనిపిస్తోంది.
కానీ వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు దొరికిన ఈ చక్కటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ చేజేతులా జార విడుచుకుంటోందని చెప్పక తప్పదు.
పైగా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. కనుక బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్సీలకు విప్ జారీ చేసి ఆయనని కాపాడుకునేందుకు తిప్పలు పడాల్సివస్తోంది. అంటే కేసీఆర్ వ్యూహం బ్యాక్ ఫైర్ అయ్యిందనే కదా అర్థం!






