తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో అయుత చండీ యాగం చేసి దేశవ్యాప్తంగా వార్తలలో నిలిచారు. ఇటీవలే ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగం కారణంగానే బంపర్ మెజారిటీతో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ నమ్మకం. అయుత చండీ యాగం వల్ల రాష్ట్రంలో తనకు ప్రతిపక్షమనేదే లేకుండా పోయిందని, నోరు ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వారు కూడా సోయలో లేకుండా పోయారని కేసీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారట. దీనితో సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన మరో పెద్ద యాగం తలపెట్టారట.
[m9ad]
సహస్ర ఆయుత చండీ యాగం పేరుతో మరో యాగం తొందర్లో ఆయన ఫార్మ్ హౌస్ లో చేపట్టబోతున్నారట. జాతీయ రాజకీయాలలో తాను తిరుగులేని శక్తిగా మారడానికి, రాష్ట్రంలో అధికార బదిలీ సులువుగా జరగడానికి ఈ యాగం ఉపకరిస్తుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారట. నిన్న విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని కలిసిన సందర్భంగా ఆయన ఈ విషయంపై చర్చించారట. రాజశ్యామల యాగం చేయించిన స్వరూపానందస్వామిని ఈ యాగం కూడా దగ్గరుండి చేయించాలని కోరారట.
కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటన ముంగించుకుని వచ్చి కేబినెట్ విస్తరణ చేశాక యాగం తేదీని నిర్ణయించబోతున్నట్టు సమాచారం. గతంలో జరిగినట్టే ఆయన ఫార్మ్ హౌస్ లోనే ఈ యాగం కూడా తలపెట్టనున్నట్టు సమాచారం. కాగా నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసిన కేసీఆర్ నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవబోతున్నారు. వారిద్దరినీ తాను ఏర్పాటు చెయ్యబోయే ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములను చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. 28 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన వివిధ జాతీయ పార్టీ నాయకులను కలవనున్నారు.



