ఏపీ, తెలంగాణ భూముల ధరలపై ఆ ఇద్దరూ చెపుతున్నది ఒక్కటేగా?

KCR-Chandrababu-Naiduఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్ముకొంటే తెలంగాణ మూడేకరాలు వచ్చేవి కానీ గత నాలుగేళ్లుగా ఏపీలో అభివృద్ధి నిలిచిపోవడంతో భూముల ధరలు పెరగలేదు. కానీ తెలంగాణలో జోరుగా అభివృద్ధి జరుగుతుండటంతో అక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో 50-100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏపీలో అభివృద్ధి జరుగకపోవడమే,” అని అన్నారు.

ఈరోజు హైదరాబాద్‌ శివార్లలో పటాన్‌చెరు వద్ద జరిగిన బహిరంగసభలో తెలంగాణ సిఎం కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ మాటలను ప్రజలకు వినిపించి, తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది కనుకనే భూముల ధరలు ఇంతగా పెరిగాయని, హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన పటాన్‌చెరులోనే ఎకరం మూడు కోట్లు పలుకుతోందని అన్నారు. ఆనాడు తాను రైతులను కోటీశ్వరులను చేస్తానని చెపితే అందరూ నవ్వారని, కానీ ఇప్పుడు అదే నిజమైందని అన్నారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా పటాన్‌చెరు వరకు మెట్రో రైలు పొడిగిస్తానంటూ కేసీఆర్‌ మరో ప్రకటన కూడా చేశారు. దీంతో అక్కడ మూడు కోట్లు పలికే భూముల ధరలు మరో కోటి పెరగకుండా ఉంటాయా?

చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ ఇద్దరూ రాజకీయంగా చాలా విభేధించుకొంటారు కానీ ఇద్దరూ చెపుతున్నది ఒకటే. అభివృద్ధితోనే ప్రజల జీవితాలలో మార్పు వస్తుందని. అభివృద్ధి జరిగితేనే ప్రజలకు లబ్ధి కలుగుతుందని. అప్పుడే వారు హర్షిస్తారని! ఇందుకు వారు చెప్పిన ఈ భూముల ధరలే ఓ చక్కటి ఉదాహరణ.

కానీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలతోనే ప్రజల జీవితాలలో మార్పు వస్తుందని గట్టిగా వాదిస్తుంటారు. దానినే ప్రభుత్వ విధానంగా మార్చేసుకొన్నారు. అభివృద్ధిని, రాష్ట్ర భవిష్యత్‌ని పణంగాపెట్టి సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంటికీ మేలు చేస్తున్నాంటూ తన పార్టీకి రాజకీయ లబ్ధి ఆశిస్తున్నారు.

అదే… అమరావతి నిర్మాణపనులు యుద్ధప్రాతిపదికన కొనసాగించి ఉండి ఉంటే ఈ నాలుగేళ్ళలో ఏపీ రాజధానికి రూపురేఖలు వచ్చి ఉండేవి. అంతేకాదు… ప్రభుత్వాలు మారినా వాటి విధానాలు మారుతాయేమో కానీ గత ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తాయని పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు బలమైన సంకేతం పంపించిన్నట్లు ఉండేది.

కానీ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో, అటు అమరావతిలో, ఇటు విశాఖలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతింది. అయితే భూకబ్జాలు మాత్రం జోరుగానే సాగుతుండటం విశేషం.

ఈవిదంగా ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ఏపీవైపు ఎవరు తొంగి చూస్తారు?అభివృద్ధి నిలిచిపోయి సంక్షేమ పధకాలు అమలుచేసుకొంటూపోతే అప్పులు ఇంకా ఇంకా పెరుగుతాయి కానీ ఆదాయం పెరగదు కదా? ఆదాయం పెరగనప్పుడు ఆ అప్పుల భారం మోయాల్సింది సామాన్య ప్రజలే కదా?

ADVERTISEMENT
Latest Stories