ఢిల్లీలో ‘కృష్ణా జలాల’ వివాదం ఏం జరిగింది?

kcr-chandrababu-uma-bharathiకృష్ణా జ‌లాల వివాదంపై కేంద్రమంత్రి ఉమాభార‌తి స‌మ‌క్షంలో ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఏర్పాటు చేసిన అపెక్స్ క‌మిటీ తొలి స‌మావేశం ముగిసింది. “ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశ‌మై కృష్ణా జ‌లాల వివాదం అంశంపై చ‌ర్చించామ‌ని, స‌మావేశం సామ‌ర‌స్యంగా జ‌రిగింద‌ని, కృష్ణా జ‌లాల విష‌యంలో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల నుంచి వ‌స్తోన్న అభ్యంత‌రాలపై కూడా చ‌ర్చించామని, మూడు అంశాల‌పై ఏకాభిప్రాయం కుదిరిందని” ఉమాభారతి స్పష్టం చేసారు.

నీటి ల‌భ్య‌త ఆధారంగా అంచ‌నా వేసి ఇరు రాష్ట్రాల‌కు దామాషా ప్ర‌కారం నీటి పంపిణీ జ‌రుగుతుంద‌ని, అన్ని ప్రాజెక్టుల అంశాల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అంగీక‌రించారని, నీటి పంపిణీపై కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారుల‌తో నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. నివేదిక‌ వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ట్రైబ్యున‌ల్‌ ను కోర‌తామ‌ని చెప్పారు. అయితే, పాల‌మూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టుల‌పై ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు.

ADVERTISEMENT

సదరు ప్రాజెక్టులు పాత‌వేన‌ని తెలంగాణ తెలుప‌గా, అవి కొత్త‌వ‌ని ఏపీ తెలిపిన‌ట్లు స‌మాచారం. కొత్త ప్రాజెక్టుల‌పై ఏపీ వినిపిస్తోన్న వాదన‌పై తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఉమాభార‌తి సూచించారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ‌కీయ అనుభ‌వం ఉన్నవారని, రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ఈ సందర్భంగా ఉమాభార‌తి సూచించారు. మ‌రోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంటూ ఏమీ ఉండ‌బోద‌ని తేల్చిచెప్పారు.

ఈ స‌మావేశంలో ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టుల‌పై తమ త‌మ‌ వాద‌న‌లు వినిపిస్తున్న స‌మ‌యంలోనే ఉమాభారతి ప‌లుసార్లు జోక్యం చేసుకొని సూచ‌న‌లు చేయాల్సి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి అంశాల కోసం ఢిల్లీ వ‌ర‌కు చర్చ‌కు రావ‌డం స‌రికాద‌ని, ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఉమాభార‌తి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ వివ‌రాలు వెల్లడించిన త‌రువాత చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంపై కేంద్రమంత్రితో మ‌రోసారి ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

ADVERTISEMENT
Latest Stories