తెలంగాణ శాసనసభలో అధికార విపక్షాల మద్య జరగాల్సిన వాదోపవాదాలు, రోడ్లపై పోలీసులతో జరుగుతుండటం విచిత్రం. సోమవారం శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటూ ముద్రించి టీ షర్ట్స్ ధరించి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వస్తే, వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. దానిని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చెలరేగిపోయింది.
అయితే ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బెడిసి కొట్టింది. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు, వందలాది కార్యకర్తలతో కేసీఆర్ ఫామ్‌హౌసుని ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ కార్యకర్తలు డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌసు చేరుకునేందుకు ప్రయత్నించారు.
కానీ ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి, వందలాదిమంది పోలీసులను మొహరించి వారిని అడ్డుకున్నారు. ఈవిషయం తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ హడావుడిగా ఫామ్‌హౌసు బయలుదేరారు. కానీ వారిని దారిలోనే పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు వారి మద్య వాగ్వాదం జరిగింది.
“రేవంత్ రెడ్డి తన గూండాగాళ్ళతో నా తండ్రిని చంపించేందుకు కుట్ర చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా?” అంటూ కేటీఆర్ పోలీసులపై విరుచుకు పడ్డారు. కానీ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కారు దిగి పాదయాత్రగా ఫామ్‌హౌసుకు బయలుదేరారు. వారి వెంట వందలాది మంది కార్యకర్తలు కూడా బయలుదేరారు.
ఇంతమందితో అక్కడికి వెళ్తే ఇరువర్గాల మద్య ఘర్షణలు జరుగుతాయని, కనుక ఫామ్‌హౌసుకి వెళ్ళవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కానీ వారిరువురూ ముందుకు సాగుతుండటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రెండు రోజుల క్రితమే కేసీఆర్ తన పార్టీ నేతలతో మాట్లాడుతూ, “నేను చనిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు.. అలాంటి వ్యక్తితో చర్చలు అవసరమా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు అలాంటి ఆలోచన లేనప్పటికీ, నేడు కాంగ్రెస్ కార్యకర్తలని కేసీఆర్ ఉంటున్న ఫామ్‌హౌసు వద్దకు పంపడంతో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌ల వాదనలకు బలం చేకూరినట్లయింది.
కనుక ‘కేసీఆర్ హత్యకు కుట్ర జరుగుతోంది’ అంటూ కేటీఆర్ వాదనలు ప్రజలలోకి బలంగా వెళతాయి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పిన మాటలకు, నేడు జరిగిన ఘటనలతో ముడిపెట్టి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకుంటుంది. ఫామ్‌హౌసు వద్ద కాంగ్రెస్ కార్యకర్తల హడావుడి చూస్తున్న తెలంగాణా ప్రజలు, కేటీఆర్ చెప్తున్న మాటలను నమ్మ్ముమే అవకాశం ఉంటుంది. కనుక నిన్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహం బెడిసి కొడితే, నేడు కాంగ్రెస్ వ్యూహం కూడా బెడిసికొట్టిందనిపిస్తోంది.





