గత కొంతకాలంగా బహిరంగ రాజకీయాలకు దూరంగా, ఫామ్ హౌస్ సమావేశాలతో పని కానిచ్చేస్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారానికి వస్తారా.? లేక ఎప్పటి మాదిరిగానే ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రకటన జారీ చేస్తారా.? అనేది ఆసక్తిగా మారింది.
అయితే బిఆర్ఎస్ ఓటమి తరువాత తాత్కాలికంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన కేసీఆర్, పార్టీ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, పార్టీ నేతల పై ఎన్ని అవినీతి విమర్శలు ఎదురైనా, చివరికి సొంత కూతురే పార్టీ పై పార్టీ ముఖ్య నాయకుల పై వ్యతిరేక స్వరం వినిపించినా కేసీఆర్ మాత్రం కేవలం ఫేమ్ హౌస్ సమావేశాలకే పరిమితమయ్యారు.
అలాంటి పరిస్థితులలో ఇప్పుడు కేసీఆర్ ఈ ఉప ఎన్నికల కోసం ప్రజా క్షేత్రంలోకి వస్తారా.? పార్టీ గెలుపు కోసం మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తారా.? గతంలో మాదిరి తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీల నేతలకు గట్టి కౌంటర్ ఇస్తారా.? ఇలా అనేక ప్రశ్నలు అటు బిఆర్ఎస్ శ్రేణులను ఇటు తెలంగాణ రాజకీయాలను వెంటాడుతున్నాయి.
అయితే కేసీఆర్ తరువాత పార్టీ పూర్తి బాధ్యతలు మోయడానికి సిద్దమైన కేటీఆర్ ఈ ఉపఎన్నికలు చాల సిరీస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నిక గెలుపు తో కేటీఆర్ తన నాయకత్వ లక్షణాలను పార్టీ నేతలతో పాటు బిఆర్ఎస్ క్యాడర్ కి అలాగే ప్రత్యర్థి పార్టీల నాయకులకు బలంగా చూపించాలి అనుకుంటున్నారు.
జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా ఇది రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ఠతకు, కేసీఆర్ ,కేటీఆర్ ల పటిష్ఠతకు నిదర్శనంగా నిలవనుంది. కేసీఆర్ ప్రస్తుతానికి రాజకీయంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ ఆయన ఒక్కసారి యాక్టీవ్ గా మునుపటి తరహా రాజకీయంతో ముందుకొస్తే తెలంగాణా రాజకీయాలలో బిఆర్ఎస్ కారు వేగం కూడా ఆమాంతం పెరిగే అవకాశం ఉంది.
అలా కాకుండా కేసీఆర్ ఇప్పుడు కూడా తన అజ్ఞాతాన్ని వీడి బయటకు రాకుంటే అది బిఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వెళుతుంది. అలాగే ఈ ఒక్క ఉపఎన్నిక ఫలితం బిఆర్ఎస్ కు సానుకూలంగా లేకుంటే ఒక పక్క అధికార కాంగ్రెస్, బిఆర్ఎస్ పై రాజకీయ దాడిని మరింత పెంచే అవకాశం ఉంటుంది.
అలాగే ఇటు బీజేపీ కూడా తెలంగాణలో బిఆర్ఎస్ శకం ముగిసింది, కేసీఆర్ రాజకీయం ఒక ముగిసిన అధ్యాయం అంటూ బిఆర్ఎస్ ఉనికిని ప్రమాదంలోకి నెడతారు. ఇక బిఆర్ఎస్ కు పక్కలో బల్లెం మాదిరి తయారైనా కవిత మరింత దూకుడుగా బిఆర్ఎస్ విలీన రాజకీయం పై విమర్శలు ఎక్కుపెడుతుంది.
కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గ ఎన్నికగా భావించడానికి లేదు. దీని ఫలితం ఖచ్చితంగా బిఆర్ఎస్ భవిష్యత్ రాజకీయం పై ప్రభావం చూపుతుంది. అయితే ఇందుకు తెరవెనుక ఉన్న సూత్రధారి, తెరముందుకు రావాల్సిన పాత్రధారి కూడా కేసీఆర్ మాత్రమే.




