అపర చాణక్యుడని పేరున్న తెలంగాణ సిఎం కేసీఆర్ హటాత్తుగా ప్రశాంత్ కిషోర్ సేవలు పొందాలనుకోవడం చూసి కాంగ్రెస్, బిజెపిలకు చాలా హుషారు వచ్చేసింది. కేసీఆర్ ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను అరువు తెచ్చుకొన్నారని వాదించడం మొదలుపెట్టాయి. అయితే కేసీఆర్ ఎత్తుగడలు దేశముదురు కాంగ్రెస్, బిజెపిలకు కూడా అంతుపట్టని స్థాయిలో ఉంటాయని ఇపుడు స్పష్టమవుతోంది.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయి మనుగడ కోసం పోరాడుతోంది. ఆ పార్టీ నేతలు ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తరువాత కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి టిఆర్ఎస్‌లో చేరిపోతారనే భావన ప్రజలకు కలగడంతో కాంగ్రెస్ విశ్వసనీయత దెబ్బతింది.
ఇప్పుడు కాంగ్రెస్‌కు పనిచేయబోతున్న ప్రశాంత్ కిషోర్‌తో సిఎం కేసీఆర్ భేటీ అవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ టిఆర్ఎస్‌తో కలిసి పనిచేయబోతుందన్నట్లు ప్రజలకు బలమైన సంకేతాలు పంపించగలిగారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ విశ్వసనీయత పూర్తిగా దెబ్బ తింటుంది కనుక ఆ పార్టీ నేతలు లబోదిబోమని మొత్తుకొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఎట్టి పరిస్థితులలో టిఆర్ఎస్‌తో కలవదని అందరూ గట్టిగా చెప్పుకోవలసివస్తోంది. అయితే ఇప్పటికే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళిపోయాయి కనుక ఇప్పుడు వారు తమ అధిష్టానానికి మొరపెట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు.
ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే, సిఎం కేసీఆర్ ప్రతీసారి తమ శత్రువుపై కత్తి దూసి పోరాడేరకం కాదు. గత రెండున్నరేళ్ళుగా ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా తదితర కేంద్రమంత్రులతో చాలా సఖ్యతగా మెలిగేవారు. కేంద్రం కూడా ఆయనతో చాలా స్నేహంగా వ్యవహరిస్తుండేది. దీంతో రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయత దెబ్బ తింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏవిదంగా తమకూ టిఆర్ఎస్‌కు ఎటువంటి రహస్య అవగాహన లేదని మొత్తుకొంటున్నారో, ఇదివరకు తెలంగాణ బిజెపి నేతలు కూడా అలాగే మొత్తుకొనేవారు. అంటే స్నేహంగా ఉంటూ కూడా ప్రత్యర్ధిని దెబ్బతీయవచ్చని సిఎం కేసీఆర్ నిరూపించారు. ఇప్పుడూ అదే చేస్తున్నారనుకోవచ్చు.
అయితే ఇప్పటికే చచ్చిన కాంగ్రెస్ పామును సిఎం కేసీఆర్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనే కర్రతో మళ్ళీ ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు? అనే సందేహం కలుగకమానదు. దీనికి బలమైన కారణమే ఉంది.
ముందుగా రాష్ట్ర ప్రజలలో, ప్రతిపక్షాలలో అయోమయం సృష్టించడం ఒకటైతే, తనతో సవ్యంగా ఉండకపోతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతానని కేంద్రానికి, బిజెపికి బలమైన సంకేతాలు పంపేందుకు కావచ్చు. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కోసం ప్రాంతీయ పార్టీలకు వలవేస్తుంటే, మరోవైపు కేసీఆర్ ఇప్పటికే కొన్ని పార్టీలకు వలవేసి ఉంచారు. కనుక ఈ శక్తులన్నీ ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఎదురీదవలసి ఉంటుంది. అందుకే సిఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ భుజంపై తుపాకి పెట్టి ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. మరి ఆయన దెబ్బకు ఎవరెవరు పడతారో? చివరికి ఏమవుతుందో?



