తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తానికి అనుకున్నది సాధించారు. కేసీఆర్ కు అప్పాయింట్మెంట్ నిరాకరించిన డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో ఆయన భేటీ అవుతున్నారు. తాము కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లిన కారణంగా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటున్న కేసీఆర్ తో భేటీ అయితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్టాలిన్ భేటీకి నిరాకరించారు. ఇది జాతీయ స్థాయిలో వార్త అయ్యింది. ఫెడరల్ ఫ్రంట్ కు ఆదిలోనే హంసపాదు అంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
దీనితో కేసీఆర్ శతవిధాల ప్రయత్నించి ఎం.కె.స్టాలిన్ అప్పాయింట్మెంట్ సాధించారు. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాల పై ఎన్నికల ఫలితాల తరువాత చర్చిద్దాం, ఈలోగా ఒక్కసారి మర్యాదపూర్వకంగా కలుస్తా అని కేసీఆర్ స్టాలిన్ కు చెప్పి ఒప్పించారట. సీఎం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనను ముగించుకుని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాక స్టాలిన్ అప్పాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దీనితో మళ్లీ చెన్నై పర్యటనకు వెళ్లారు. ఈరోజు ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా చెన్నైకి వెళ్లారు.
రాత్రి చెన్నైలో బస చేసి, సోమవారం స్టాలిన్‌తో భేటీ అవుతారు. ఈరోజు తమిళనాడులోని పలు దేవాలయాలు సందర్శిస్తారు. సమాఖ్య కూటమి, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఈ పర్యటనకు వెళ్ళలేదు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది దశ ఉన్నందున ఆయన రాష్ట్రంలోనే ఉండి వాటిని పర్యవేక్షించనున్నారు.



