kcr national party Preparations తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో భారత్‌ రాష్ట్రీయ సమితి లేదా మరో పేరుతో కొత్తగా జాతీయపార్టీ స్థాపించి జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆదిలోనే ఆయనకు ఓ అగ్నిపరీక్ష ఎదురైంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి పోటీగా దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ మరో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సిద్దమయ్యాయి. దీని కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్వర్యంలో నేడు ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్బులో బిజెపీయేతర పార్టీలు సమావేశం అవుతున్నాయి. దీనిలో పాల్గొనవలసిందిగా సిఎం కేసీఆర్‌ను కూడా మమతా బెనర్జీ ఆహ్వానించారు.

అయితే ఆమె కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించడంతో ఈ సమావేశానికి హాజరుకాకూడదని కేసీఆర్‌ నిర్ణయించుకొన్నారు. ఎందుకంటే, ఇంతకాలం దేశాన్ని పాలించిన, పాలిస్తున్న కాంగ్రెస్, బిజెపిల వలననే దేశం అభివృద్ధి చెందలేకపోయిందని, కనుక వాటికి ప్రత్యామ్నాయంగా కూటమి లేదా పార్టీ ఏర్పాటు చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే అది ఆయన ఆశయానికే విరుద్దమవుతుంది.

ఇప్పుడు కలిసి పనిచేయగలిగితే రేపు సార్వత్రిక ఎన్నికలలో కూడా కలిసి పనిచేయడం అనివార్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడమంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే అవుతుంది. అందుకోసమే అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించనవసరమే లేదు. కనుక కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలని ఖచ్చితంగా నిర్ణయించుకొన్నట్లే కనబడుతోంది.

ఇదీగాక ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుంది. కనుక ఈ సమావేశానికి దూరంగా ఉండటమే మంచిదని సిఎం కేసీఆర్‌ నిర్ణయించుకొన్నారు.

కేసీఆర్‌ ఓ పెద్ద ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈవిదంగా దూరదృష్టితో ఆలోచించి అడుగు ముందుకు వేస్తుండటం చాలా అవసరమే. అయితే ఇప్పుడు బిజెపియేతర పార్టీల సమావేశానికి ఆయన దూరంగా ఉన్నప్పుడు, రేపు ఆయన జాతీయపార్టీతో వాటి వద్దకు వెళ్ళి సహాయసహకారాలు ఆశిస్తే అవి సహకరిస్తాయా?అంటే కాదనే అర్దమవుతోంది.

కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేయక మునుపే ఈ పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈ సమావేశానికి కేసీఆర్‌ హాజరుకాకపోయినా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు తెలిపి వాటి నమ్మకం పొందే ప్రయత్నం చేస్తారేమో?

అయితే ఉత్తరాదిన 40 నుంచి 80 ఎంపీ సీట్లున్న రాష్ట్రాల నేతలు ప్రధానమంత్రి పదవి ఆశించడం సహజం. కానీ కేవలం 17 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న కేసీఆర్‌ నాయకత్వాన్ని ఎందుకు అంగీకరిస్తారు? కేసీఆర్‌ ప్రధానమంత్రి అయ్యేందుకు వారు ఎందుకు సహకరిస్తారు? అనే ప్రశ్నలకు కేసీఆర్‌, టిఆర్ఎస్‌ పార్టీ నేతలే సమాధానం వెతుక్కోవలసి ఉంటుంది.