అధికారంలో ఉండే పార్టీ నాయకుల పబ్లిసిటీ తిప్పలు చిత్రంగా ఉంటాయి. ప్రజలకు ఖర్చుపెట్టే ప్రతి రూపాయి మీద ముఖ్యమంత్రుల బొమ్మలు ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఏ రాష్ట్రమైన ఇదే గొడవ. తాజాగా అటువంటిదే తెలంగాణాలో నడుస్తుంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రెండు విడతలుగా ఎనిమిదివేలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.
వాటికి సంబంధించిన చెక్కులపై ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని బ్యాంకులను కోరారట. అయితే కెసిఆర్ బొమ్మను చెక్కులపై ముద్రించడానికి బ్యాంకులు అంగీకరించలేదట. కనీసం చెక్ ల రంగు టిఆర్ఎస్ పార్టీ రంగు – గులాబీ రంగులో ఉండాలని కోరారట. అయితే దానికి కూడా రిజర్వు బ్యాంక్ అనుమతి తీసుకోవాలని బ్యాంకులు స్పష్టం చేశాయట.
ఈ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. “చెక్కులపై కేసీఆర్ బొమ్మలా? పోనీ రైతుల వరి పైరుపై వెయ్యకపోయారా?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నాయి. మే నెల నుండి రైతులకు చెక్కుల పంపిణీ జరగబోతుంది. రిజర్వు బ్యాంక్ గులాబీ రంగు చెక్కులు అనుమతిస్తాదో లేదో చూడాలి.



