భారత్-పాకిస్థాన్ విడిపోయి ఏడున్నర దశాబ్ధాలు గడిచినా నేటికీ పరస్పరం కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. అదేవిదంగా ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి 11 ఏళ్ళు గడిచినా నేటికీ ఘర్షణ వాతావరణమే నెలకొంది.
ఈ రెండు దేశాలు, రెండు రాష్ట్రాల మద్య ఇటువంటి పరిస్థితి ఎందుకు ఉందో అందరికీ తెలుసు. కనుక పొరుగు దేశంలో, పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతోందో మనకి అనవసరం అని అనుకునే పరిస్థితి లేదు.
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఓసారి చూస్తే, మొన్న 25వ గులాబీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగితే సిఎం రేవంత్ రెడ్డి, మరొకరిద్దరు మంత్రులు మాత్రమే బదులిచ్చారు. ఇది కాంగ్రెస్‌లో అనైక్యత, సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒంటరివారయ్యారని సూచిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
సిఎం రేవంత్ రెడ్డి స్పందనలో కూడా కేసీఆర్‌కి ఘాటుగా జవాబు ఇచ్చింది తక్కువ.. కానీ సొంత పార్టీలో లోటుపాట్లను స్వయంగా బయట పెట్టుకున్నట్లయింది.
తాను పదేపదే చెపుతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్ళకుండా హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని, పదవులపై ఉన్న శ్రద్ద ప్రభుత్వం అమలుచేస్తున్న హామీలు, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు చెప్పుకోవడంలో లేదని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిదంగా ఉందో రేవంత్ రెడ్డి మాటలే పట్టిస్తున్నాయి.
హైడ్రా, లగచర్ల, గచ్చిబౌలి భూముల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదెబ్బలు తింది. కేసీఆర్ వాటిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పాలనతో ప్రజలు వేసారిపోయారని కనుక మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చాలా నమ్మకంగా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో సిఎం రేవంత్ రెడ్డి ఒక్కరే అంత నమ్మకంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెపుతున్నారు తప్ప మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ చెప్పడం లేదు! కనీసం కేసీఆర్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు!
ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీలని బేరీజు వేసుకొని చూస్తే, బలహీనంగా ఉందనుకున్న బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తోంది. చాలా బలంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా కనిపిస్తోంది.
అయితే తెలంగాణ రాజకీయాలు మనకెందుకు? అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకెందుకు?అని ఆంధ్ర ప్రజలు అనుకోలేరు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రా రాజకీయాలలో వేలుపెట్టి చంద్రబాబు నాయుడుని గద్దె దించి జగన్‌ని కూర్చోబెట్టారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా సిఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
కనుక తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడినా, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఆంధ్రాకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, టీడీపీకి మళ్ళీ సమస్యలు తప్పవు.
అలాగాని సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పనిగట్టుకొని తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టే ఆలోచన ఏమీ చేయడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీజేపి వాటంతట అవి బలపడితే చాలు.. అవే బిఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్ సంగతి చూసుకుంటాయి. అంతవరకు ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండక తప్పదు.




