చికెన్ బిర్యానీ, కొత్త ఆవకాయలా ఆంధ్రా రాజకీయాలు గుమగుమలాడుతుంటే మద్యలో తోటకూడ వేపుడులాంటి తెలంగాణ రాజకీయాలు చాలా మందికి రుచించకపోవచ్చు. కానీ కేసీఆర్ గురించి వినాలనుకునేవారు ఆంధ్రాలో చాలా మందే ఉన్నారు. కనుక వారి కోసమైన కేసీఆర్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోక తప్పదు.
క్లుప్తంగా చెప్పుకుంటే, కేసీఆర్ తాజా ఇంటర్వ్యూలో మోడీ తనను అరెస్ట్ చేయాలనుకున్నారని కానీ తాను ఎటువంటి అవినీతికి పాల్పడకపోవడంతో అరెస్ట్ చేయించలేకపోయారని తేల్చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మోడీ సృష్టించిన ఈ వికృత రాజకీయం తప్ప అసలు దానిలో ‘మ్యాటర్’ ఏమీ లేదని తేల్చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, ఒకవేళ ఏవైనా తప్పులు జరిగితే అవి చేసిన అధికారులే బాధ్యులని కేసీఆర్ తేల్చి చెప్పేశారు.
మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడం, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి జరిగిందనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు అన్నీ కూడా చిల్లర రాజకీయాలే అని కేసీఆర్ సర్టిఫై చేసేశారు.
కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలలో అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా జరుగవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని కేసీఆర్ చెప్పారు.
ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్‌తో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేసీఆర్ మరో కొత్త జోస్యం చెప్పారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో 12 బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోబోతోందని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే దానిలో కీలక పాత్ర పోషించబోతోందని కేసీఆర్ చెప్పారు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత బిఆర్ఎస్ నుంచి బయటకు పోయిన నేతలందరూ చిల్లర గాళ్ళే… అవకాశవాదులే… వాళ్ళు బయటకు పోయినా పార్టీకి నష్టం లేదని కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ చెప్పిందాని ప్రకారం ఆయన ఓ ఆణిముత్యం. కూతురు కల్వకుంట్ల కవిత మరో ఆణిముత్యం. తనకు మాత్రమే తెలంగాణ పట్ల నిబద్దత ఉంది మరెవరికీ లేదు.
మోడీ ఓడిపోబోతున్నాడని ఆయనకు తెలీదు. కానీ బిఆర్ఎస్ 12 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని కేసీఆర్‌కు తెలుసు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు, కేంద్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చక్రం తిప్పడానికి కేసీఆర్ సిద్దంగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినా మూడో రోజు నుంచే కూలిపోతుందని, కూల్చేస్తామని బిఆర్ఎస్ నేతలు పాట మొదలుపెట్టారు. నాలుగు నెలలు గడిచేసరికి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవీ కాలం ముగిసిపోయిందన్నట్లే ఉన్నాయి కేసీఆర్ మాటలు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత కేసీఆర్, కేటీఆర్‌లో అహంభావం కాస్త తగ్గిన్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు వింటే ఇంకా తగ్గలేదని స్పష్టం అవుతోంది. వారి అహంకారం వలననే బిఆర్ఎస్ ఓడిపోయింది. కనుక లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికలలో ఓడిపోతే అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేయకుండా ఉండవు. కనుక ఆయన చెప్పిన్నట్లు లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏమైనా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది.




