తెలంగాణ తొలి సిఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలో తన పార్టీకి ఎదురే ఉండకూడదని కాంగ్రెస్, టిడిపి నేతలు, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొని వాటిని నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత ప్రతీ చిన్నాపెద్ద ఎన్నికలలో బిఆర్ఎస్ వరుసపెట్టి గెలుస్తుండటంతో ఆయన వ్యూహం ఫలించిన్నట్లే అనిపించింది.
కానీ దాని స్థానంలోకి బీజేపీ ప్రవేశించిన తర్వాత గంగిగోవు వంటి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం పెద్ద పొరపాటని కేసీఆర్‌కు అర్దమైంది. కేంద్రంలో అధికారంలోకి రాలేక, బలమైన నాయకత్వంలేక కుమ్ములాటలతో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నిర్వీర్యం చేసుకొని, కేంద్రంలో అధికారంలో ఉన్న, తనకంటే వెయ్యి రెట్లు శక్తివంతమైన ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీని తెచ్చుకొని కేసీఆర్ ఎంత బాధపడ్డారో అందరూ చూశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా చేసిన బండి సంజయ్ కేసీఆర్ అంతటివాడికి చెమటలు పట్టించారు. బిఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే నమ్మకం ప్రజలకు, పార్టీ శ్రేణులకు, బహుశః బిఆర్ఎస్ పార్టీకి కూడా కలిగించగలిగారు. దీంతో కేసీఆర్ బండి సంజయ్‌ని ఢీకొని తన స్థాయి తగ్గించుకోవడం కంటే మోడీని ఢీకొని తన స్థాయి పెంచుకోవడం మేలని భావించి యుద్ధం ప్రకటించేశారు.
అందుకోసం హడావుడిగా టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ పార్టీగా మార్చేసుకొన్నారు. టిఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజలు ఎంతగానో కనెక్ట్ అయ్యున్నారని, కనుక చేజేతులా అంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న పేరుని వదులుకోవద్దని టిఆర్ఎస్ నేతలు ఎంతగా చెప్పినా కేసీఆర్ వినలేదు. అదో పెద్ద పొరపాటని అందరూ అభిప్రాయపడ్డారు.
బిఆర్ఎస్ పార్టీతో ఢిల్లీకి జైత్రయాత్రకు బయలుదేరాలని కేసీఆర్ అనుకొంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఆయనకు బ్రేకులు వేసింది. దీంతో కర్ణాటక శాసనసభ ఎన్నికలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండిపోవలసి వచ్చింది.
కేసీఆర్ మహారాష్ట్రలో తిరుగుతుంటే తెలంగాణ ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో అటు పక్క వెళ్ళడం మానుకొని తెలంగాణలోనే కాళ్ళకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పర్వాలేదు. కానీ ఓడిపోతే తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవుతుంది.
రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ ప్రత్యర్ధిగా ఉంటేనే మేలని కేసీఆర్ కాస్త ఆలస్యంగా గ్రహించారు. కనుక కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి మళ్ళీ లేపేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్ధులలో సగం మందికి ఆయనే ఎన్నికల ఖర్చులకు డబ్బు ఇస్తున్నారని, గెలిచిన తర్వాత కేసీఆర్ సైగ చేయగానే వాళ్ళందరూ బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
ఆయన కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపారో తెలీదు కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హటాత్తుగా పుంజుకొంది. ఎంతగా అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించే అంతగా! కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండటంతో ఈసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణలో కొన్ని సానుకూల పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
ఇదివరకు కేసీఆర్ కాంగ్రెస్‌ని వదిలించుకొందామనుకొంటే దాని కంటే శక్తివంతమైన బీజేపీ జలగలా పట్టుకొంది. ఇప్పుడు బీజేపీని వదిలించుకొందామనుకొంటే కాంగ్రెస్ ఏకు మేకైయింది. కేసీఆర్ లెక్కలు పదేపదే ఎందుకు ఇలా తేడా కొడుతున్నాయో?




