KCR-Cloudburst-Telangana-Rains-రాజకీయాలలో ఉన్నవారు ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నవారు చెప్పుకొనే గొప్పలు ఒక్కోసారి వారి కొంపనే ముంచుతుంటాయి. ఇక్కడ జగన్ ప్రభుత్వం దేశంలో మేమే నంబర్ వన్ అని గొప్పలు చెప్పుకొని నవ్వులపాలవుతుంటే, అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా మేమే నంబర్ వన్ అని గొప్పలు చెప్పుకొంటుంది.

అంతా సవ్యంగా ఉన్నంతవరకు పర్వాలేదు కానీ తేడా వచ్చినప్పుడే ఆ గొప్పలు బెడిసికొడుతుంటాయి. వాటిలో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా చేయలేని పనిని తమ ప్రభుత్వం కేవలం మూడేళ్ళలో పూర్తి చేసిందని, సిఎం కేసీఆర్‌ స్వయంగా దానిని డిజైన్ చేశారని, అదొక ఇంజనీరింగ్ మహాద్భుతమని యావత్ ప్రపంచం పొగుడుతోందని టిఆర్ఎస్‌ నేతలు గొప్పలు చెప్పుకొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదికి సిఎం కేసీఆర్‌ నడకలు నేర్పారని, రాష్ట్రానికి వరదల బెడద లేకుండా చేశారని చెప్పుకొన్నారు.

ఆ గొప్పలే ఇప్పుడు సిఎం కేసీఆర్‌ పరువు, టిఆర్ఎస్‌ ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆ ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం పంపుహౌసులు నీట మునిగాయి. వాటిలో వందల కోట్లు ఖరీదు చేసే 17 భారీ మోటర్లు, విద్యుత్ ప్యానల్ బోర్డులు, అనేక యంత్రాలు కూడా నీట మునిగాయి. ప్రాధమిక అంచనా ప్రకారమే నష్టం రూ.500 కోట్లు పైన ఉంటుందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక వరదల బెడద ఉండడనుకొంటే దాని దిగువన ఉన్న అనేక గ్రామాలు నీట మునిగాయి.

కనుక వైఎస్సార్ తెలంగాణ పార్టీతో సహా కాంగ్రెస్‌, బిజెపిలు సిఎం కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. నా అంత మేధావి లేడన్నట్లు మాట్లాడే సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ఏమి సమాధానం చెపుతారని నిలదీస్తున్నాయి. అతిగా గొప్పలు చెప్పుకొంటే ఏమవుతుందో తెలుసుకొనేందుకు ఇదే ఓ చక్కటి ఉదాహరణ.

అయితే తమ తప్పును కప్పి పుచ్చుకొనేందుకు సిఎం కేసీఆర్‌ మాట్లాడిన మరో మాట ‘క్లౌడ్ బరస్ట్’ కూడా బెడిసికొట్టింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో అకస్మాత్తుగా ఈ స్థాయిలో వర్షాలు పడటం, వరదలు రావడం బహుశః విదేశీ కుట్ర అయ్యుండవచ్చని సిఎం కేసీఆర్‌ నోరుజారారు. గతంలో లద్దాక్, ఉత్తరాఖండ్‌లో శతృదేశాలు క్లౌడ్ బరస్ట్ విధానంలో అకాలవర్షాలు, భారీ వరదలు వచ్చేలా చేసినట్లు సమాచారం ఉందని కనుక తెలంగాణలో కూడా క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానం కలుగుతోందని సిఎం కేసీఆర్‌ అన్నారు.

దాంతో సిఎం కేసీఆర్‌ మరోసారి ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ షర్మిల స్పందిస్తూ “ఆంద్రోళ్ళ కుట్రలైపోయాయి…. ప్రతిపక్షాల కుట్రలైపోయాయి…. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లు అయిపోయాయి…. కేంద్ర ప్రభుత్వం వివక్ష కూడా అయిపోయింది. ఇప్పుడు విదేశాలు కూడా కేసీఆర్‌ మీద పగబట్టారు. పాపం.. కేసీఆర్‌కు ఎంత కష్టమొచ్చింది?” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.