క్రికెట్ ప్రేమికులను అబ్బూర పరుస్తున్న కేదార్ జాదవ్!

Kedar Jadhav  India vs England ODIజట్టులోకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత అడుగుపెట్టినా… అదిరిపోయే ప్రదర్శనలను ఇవ్వడంలో కేదార్ జాదవ్ కేరాఫ్ అడ్రస్ గా మారారు. ముఖ్యంగా తాజాగా ముగిసిన వన్డే సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ టీమిండియాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. 350 పరుగుల ఛేజింగ్ లో అద్భుతమైన సెంచరీతో తొలి వన్డే టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కేదార్, మూడవ వన్డేలో కూడా అదే బాధ్యతను నిర్వహించినప్పటికీ, విజయం మాత్రం వరించలేదు.

ఓ పక్కన టాపార్డర్ వికెట్లన్నీ నేలకూరుతున్నా… జట్టు విజయంపై నమ్మకం కోల్పోని జాదవ్ చివరి ఓవర్ దాకా పోరాడాడు. బహుశా మరో బాల్ సరిగ్గా కనెక్ట్ అయ్యి ఉంటే, టీమిండియా ఖాతాలో మరో విజయం పడేదని చెప్పనవసరం లేదు. చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సిన సమయంలో… మొదటి బంతిని సిక్సర్ గా, రెండవ బంతిని బౌండరీగా మలిచి, విజయంపై ఆశలు పెంచిన జాదవ్, తదుపరి రెండు బంతులలో పరుగులేమీ చేయలేకపోవడంతో, విజయానికి 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఈ తరుణంలో భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద అవుట్ కావడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. 75 బంతుల్లో 90 పరుగులతో జాదవ్ చేసిన పోరాటం… అంతిమంగా వృధా ప్రయాసగానే మిగిలింది. అయితే టీమిండియా భవిష్యత్తుపై మరింత నమ్మకాన్ని పెంచింది. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ అద్భుతంగా రాణిస్తుండడం జాదవ్ ప్రత్యేకతగా మారడంతో… క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని చూరగొంటున్నాడు. అందుకే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ను కూడా జాదవ్ దోచుకున్నాడు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న రీతిలో చెలరేగిపోతున్న జాదవ్, భవిష్యత్తులో టీమిండియాకు మరిన్ని విజయాలు అందివ్వాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories