2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీ ఇచ్చిన వై నాట్ 175 నినాదం మాయలో పడిన కేశినేని నాని టీడీపీని కాదని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వద్దని జగన్ పంచన చేరారు. రెండు సార్లు విజయవాడ ఎంపీ గా గెలిచిన నేను పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం కాదు పార్టీనే నా ఆదేశాలను పాటించాలి అనేలా కేశినేని నాని గెలుపు బలుపు తలకెక్కించుకున్నారు.
2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ ఓటమి భారాన్ని అనుభవిస్తున్న తరుణంలో పార్టీకి, పార్టీ క్యాడర్ కు బలంగా ఉండాల్సిన కేశినేని నాని పార్టీ ఓడినా నేను గెలిచాను అనే విజయ గర్వంతో పూర్తిగా టీడీపీ పార్టీని విస్మరించి తన ఇష్టాను సారంగా ప్రవర్తించారు. ఎంపీ గా అవకాశం ఇచ్చిన పార్టీని పక్కన పెట్టి, గెలిపించిన ఓటర్ల అభిమతాన్ని పట్టించుకోకుండా, గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి, సొంత తమ్ముడుతో వివాదాలు పెట్టుకుని పార్టీ మారడానికి కుంటి సాకులు వెతికారు నాని.
Also Read – నంద్యాల వైల్డ్ ఫైర్: ఏపీ ప్రభుత్వం హుందాతనం శభాష్!
దీనితో అవకాశం చూసి దెబ్బ కొట్టడంలో నాని ఆరితేరిపోయారని మరోసారి రుజువు చేసుకున్నారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీ పార్టీలో చేరిన నాని ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ పార్టీ మీద, పార్టీ అధినేత మెగాస్టార్ మీద నిందలు మోపి బయటకు వచ్చి తన రాజకీయ ప్రయాణానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే అప్పుడు తానూ చేసిన పనితో రాజకీయంగా ఒక మెట్టు ఎక్కారు నాని.
ఇప్పుడు కూడా అదే తీరును నమ్ముకుని టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ కొట్టారు నాని. అయితే అన్ని వేళల కాలం తనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవడం నాని అమాయకత్వమే అయ్యింది. రెండు సార్లు ఎంపీ గా అవకాశం ఇచ్చిన పార్టీని కాలతన్నుకుని, తన గెలుపు కోసం తెర వెనుక పని చేసిన తమ్ముడితో వైరం పెట్టుకుని అవినీతి కోట్ల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ గూటికి చేరిన నానికి విజయవాడ ప్రజలు తమ ఓటు తో మంచి గుణపాఠం చెప్పారు.
Also Read – సినీ పరిశ్రమకు ఏపీ ఒక ఆదాయ వనరేనా.?
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వైసీపీ నావ ఎక్కి ఎగిరెగిరి పడ్డాడు కేశినేని నాని. ఆయన స్థానంలో టీడీపీ పార్టీకి అండగా ఉన్న ఆయన తమ్ముడు కేశినేని చిన్ని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నాని గెలుపు బలుపును బద్దలుకొట్టి టీడీపీ నుండి విజయవాడ ఎంపీ గా నెగ్గారు. టీడీపీ ,జనసేన, బీజేపీ కూటమి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోను అధికారంలోకి రావడంతో కేంద్ర మంత్రి వర్గంలోకి అడుగు పెట్టింది టీడీపీ.
అయితే టీడీపీ ఎంపీ గా హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుండి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి అనూహ్య విజయం అందుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు మోడీ సర్కార్ లో మంత్రి పదవులు దక్కడంతో అందరి ద్రుష్టి కేశినేని నాని వైపు పడింది. కేశినేని నాని టీడీపీ పార్టీ తరుపున బరిలోకి దిగి ఉంటే ఖచ్చితంగా విజయాన్ని అందుకునే వారే దానితో పార్టీలో మరో హ్యాట్రిక్ విక్టరీ అందుకున్న నానికే ఈ మంత్రి పదవి అవకాశం దక్కివుండేది అంటూ నాని పై జాలిపడుతున్నారు ఆయన అనుచరులు.
Also Read – రామ్ గోపాల్ వర్మ….ఏంటి ఈ ధీమా.?
అధికారంలోకి వచ్చే పార్టీని వదులుకోవడమే కాదు ఆ పార్టీ అధినేత, ఆయన కుమారుడు పై కూడా నోటికి వచ్చిందల్లా వాగి క్షమించరాని తప్పు చేసారు అంటూ ఆయన అనుచరులే నాని పై గుర్రుగా ఉన్నారు. వచ్చిన 11 సీట్లతో వైసీపీ కనీసం ప్రతిపక్ష హొదాను కూడా దక్కించుకోకపోవడంతో ఒకరి అదృష్టాన్నే కాదు ఒకరి దురదృష్టాన్ని కూడా ఎంత వద్దనుకున్నా దూరం చేయలేమనేది తేలిపోయింది అంటూ పెమ్మసాని అదృష్టాన్ని చూసి ఆనందపడాలో నాని దురదృష్టాన్ని చూసి జాలిపడాలో అర్ధం కావడంలేదంటున్నారు టీడీపీ శ్రేణులు.