ఒక దశాబ్దం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా చూడాలని ఏ అభిమానికి మాత్రం ఉండదు. కానీ, అందరికీ టికెట్లు లభించే పరిస్థితులు లేవు కదా! మల్టీప్లెక్స్ ధియేటర్లలో ఆన్ లైన్ విధానంతో ఇప్పటికే టికెట్లు అయిపోగా, మరికొన్ని పలుకుబడి గల వ్యక్తుల కోసం కేటాయింపులు చేయడం సహజమే. మరో పక్కన బి గ్రేడ్ ధియేటర్ల వద్ద ‘బ్లాక్’లో భారీ రేట్లకు టికెట్లు అమ్ముడుపోవడం సహజమే. దీంతో తమ అభిమాన హీరో సినిమా “ఖైదీ నంబర్ 150” టికెట్లు లభించలేదన్న ఆగ్రహంతో చాలా మందే ఉన్నారు.
అలాంటి అభిమానుల్లో ఓ వీరాభిమాని మద్యం మత్తులో రెచ్చిపోయాడు. తానూ ఏం చేస్తోన్నది తెలియక, బ్లేడుతో గొంతు కోసేసుకుని రచ్చ రచ్చ చేశాడు. విశాఖపట్నం, రామా టాకీస్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సదరు అభిమాని మెడకు గాయం కాగా, మెడ నుండి రక్తం కారుతూ ధియేటర్ ప్రాంగణంలో అలాగే తిరిగాడు. థియేటర్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నం చేసినప్పటికీ, చికిత్స చేయించుకునేందుకు వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు.
‘ఖైదీ నంబర్ 150’ టికెట్ ఇస్తే తప్ప ఎవరి మాట విననని మూర్ఖంగా ప్రవర్తించిన అతను, టికెట్ ఇవ్వకుంటే చచ్చిపోతానని స్థానికంగా కాసేపు హడలెత్తించాడు. అయితే చివరికి పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ధియేటర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఒకప్పుడు టికెట్ల కోసం లైన్లో నిల్చుని, తోపులాడుకుని ప్రాణాలు విడిచేవారు. బహుశా ట్రెండ్ మారినట్లుగా కనపడుతోంది. ప్రస్తుతం అభిమానులే ‘సూసైడ్’ దిశగా అడుగులు వేయడం శోచనీయమైన విషయం.



