వైసీపీ 175 సీట్లు గెలుచుకొంటే టిడిపికి తాళాలు వేసుకొంటాం..అచ్చన్న సవాల్

Kinjarapu_Atchannaidu_on_YCP_Winning_175_Seatsవచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాలు వైసీపీయే గెలుచుకొంటుందని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నుంచి మీడియాతో మాట్లాడుతూ, “మీ పార్టీ 175 స్థానాలు గెలుచుకొంటుందనే నమ్మకమే మీకుంటే తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రండి. ఒకవేళ ఎన్నికలలో మీ పార్టీ 175 స్థానాలు గెలుచుకొంటే మేము మా పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసుకోవడానికి సిద్దం. సిఎం జగన్మోహన్ రెడ్డి నా సవాలును స్వీకరించగలరా?దమ్ముంటే వెంటనే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రావాలి.

మీ మందిమార్భలాన్ని దించేసి, పోలీసులతో ప్రతిపక్షాలను అడ్డుకొంటూ, ఎన్నికలలో మ్యానిప్యులేట్ చేసి గెలిచేయడానికి శాసనసభ ఎన్నికలేమీ పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలు కావు.

ADVERTISEMENT

గత ఎన్నికలలో ప్రజలను ఒక్క ఛాన్స్ అని బ్రతిమాలుకొంటే మీ మాయమాటలను నమ్మి ఓట్లేసి గెలిపించారు. కానీ ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యావ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. ఒక్కసారి గెలిపించినందుకే ప్రజలు పశ్చాతాపపడుతున్నారు. ఈ మూడేళ్ళలో రాష్ట్రానికి ఏమి మేలు చేశారని మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలి?

ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని గొప్పలు చెప్పుకొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళ ముందుగానే ఎన్నికల సన్నాహాలు ఎందుకు మొదలుపెట్టేశారో చెప్పగలరా?అంటే మీ పాలనపై ప్రజలలో రోజురోజుకీ అసంతృప్తి పెరిగిపోతోందని, మళ్ళీ అధికారంలోకి రాలేమనే భయం మీలో మొదలైంది. అందుకే 175 సీట్లు గెలుస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. దమ్ముంటే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రండి. 175 సీట్లు గెలిచి చూపించండి,” అని అచ్చెన్నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకి సవాల్ విసిరారు.

ADVERTISEMENT
Latest Stories