కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా వచ్చేశారు… దేనికైనా రెడీ అట!

Kiran kumar Reddyసమైక్య రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత అమెరికాలో ఓ నెలరోజులపాటు ఉండి కొన్ని సొంత పనులు చక్కబెట్టుకొన్నాక నేడు తొలిసారిగా విజయవాడకు వచ్చారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు తదితర పెద్దలతో సమావేశమయ్యి రాష్ట్రంలో బిజెపి పరిస్థితి, పార్టీని ఏవిదంగా బలోపేతం చేయాలనే దానిపై గురించి చర్చించుకొన్నామని కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.

తనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఏపీలో జగన్‌ పాలన తీరు గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు “ఇలా రోడ్డు మీద నిలుచొని మాట్లాడే అంశం కాదిది. గంటల తరబడి మాట్లాడాల్సిన అంశం ఇది,” అంటూ ముగించారు.

ADVERTISEMENT

కిరణ్‌ కుమార్‌ రెడ్డి తాను ఏ రాష్ట్రంలోనైనా పనిచేయడానికి సిద్దమని చెపుతున్నప్పటికీ, ఆయన విజయవాడ వచ్చి సోమూ వీర్రాజుతో భేటీ అయినందున, ఏపీ బిజెపి కోసం పనిచేయబోతున్నారని స్పష్టమైంది. ఏపీ బిజెపి దాదాపు నిద్రాణస్థితిలో ఉంది. కనుక ముందుగా దానిని నిద్రలేపి చలనం తీసుకురావలసి ఉంటుంది.

తర్వాత ఏపీలో బిజెపి బలం, బలహీనతలను బేరీజు వేసి చూసుకోవాలి. దానిని బట్టి జనసేనతో పొత్తులు అవసరమా కాదా? అని తేల్చుకోవాలి. సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్డీయేలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న మాట నిజమైతే, అది అవసరమో కాదో… మంచిదో… కాదో తేల్చుకోవాలి. వీటిని బట్టి వైసీపీ, టిడిపి, జనసేనలను ఏవిదంగా హ్యాండిల్ చేయాలో నిర్ణయించుకోవాలి.

రాష్ట్ర వ్యాప్తంగా వివిద కులాలు, వర్గాల ప్రజలను, ఇతర పార్టీల నేతలను ముఖ్యంగా కాంగ్రెస్‌, వైసీపీలో రెడ్లను, టిడిపి, వైసీపీలలో బీసీ నేతలను ఏవిదంగా ఆకట్టుకోవాలో ఆలోచించుకోవాలి.

నిజానికి సోమూ వీర్రాజుతో సహా రాష్ట్ర బిజెపి నేతలందరూ వీటన్నిటిపై ఇప్పటికే కొన్ని నిశ్చితాభిప్రాయాలు కలిగే ఉంటారు. కానీ అభిప్రాయాలు ముఖ్యం కాదు… హోమ్ వర్క్ ముఖ్యం. ఒకవేళ వారు చేసి ఉండకపోతే కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేయాల్సి ఉంటుంది.

ఇవన్నీ రాజకీయ కోణంలోవి కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబందించి, అమరావతి, పోలవరం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతుల కల్పన, అప్పులు, ఆదాయం, విభజన హామీలు వంటి సమస్యలన్నిటికీ బిజెపి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.

కనుక కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఏపీలో పూలబాట పరిచి సిద్దంగా ఉందనుకోలేము. కానీ ఇలా ఒకరి తర్వాత ఒకరు అనుకోని అతిధులు ఊడిపడి, ప్రజలను, ఓట్లను చీల్చుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు. ఎప్పటికీ రాజకీయ ప్రయోగశాలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories