ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా గుడివాడలో కొడాలి నాని ఎన్నికలలో డబ్బు పంపిణీ గురించి వార్తాలే వస్తున్నాయి. పోలింగ్ ముందు రోజు నియోజకవర్గంలో ఓటర్లకు ఇచ్చేందుకు ఓటుకి ఇంత చొప్పున నాని తన అనుచరులకు డబ్బు కట్టలు ఇస్తే, వారిలో కొందరు వాటిని పంచకుండా నొక్కేశారని నాని ముఖ్య అనుచరుడు సర్దార్ బేగ్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.
“నాని ఇచ్చిన డబ్బుని ఓటర్లకు పంచకుండా తిన్నవారిని వెంటనే గుడివాడలో కె.కన్వెషన్ కళ్యాణ మండపానికి పిలిపించి గట్టిగా నిలదీసి తిరిగి వసూలు చేసుకోవాలి. లేకుంటే వారందరూ ఆ డబ్బుతో గోవా, మలేషియా, సింగపూర్ వెళ్ళి జల్సా చేసి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఎవరైనా డబ్బు తిరిగి ఇవ్వకపోతే వారిపై మీ పెంపుడు కుక్కలని వదిలేయండి. నమ్మక ద్రోహం చేసినవారికి అదే సరైన శిక్ష,” అంటూ సర్దార్ బేగ్ కొడాలి నాని తమ్ముడి చిన్నికి పంపిన వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గుడివాడలో 10,11,12 వార్డులలో కొందరు మహిళలు తమకు డబ్బు అందలేదంటూ నిరసనలు తెలిపారు కూడా. ఇప్పుడు కొడాలి నాని ముఖ్య అనుచరుడు సర్ధార్ బేగ్ ఓటర్లకు డబ్బు పంపిణీ వ్యవహారం గురించి బయటపెట్టారు. సోషల్ మీడియాలో ఆయన వీడియో సందేశం ఇంత వైరల్ అవుతున్నా ఇంతవరకు ఎన్నికల సంఘం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంచకూడదని ఎన్నికల నియమావళి. కానీ అన్ని పార్టీలు పంచుతూనే ఉన్నాయని ఎన్నికల సంఘానికి కూడా తెలుసు. ఒకవేళ తెలియకపోతే మీడియా ఎక్కడెక్కడ ఏ పార్టీ ఎంత పంచిందో చెపుతూనే ఉంది. డబ్బు అందని ఓటర్లు కూడా బహిరంగంగా చెపుతూనే ఉన్నారు.
ఇప్పుడు కొడాలి నాని ముఖ్య అనుచరుడే చెపుతున్నారు ఎన్నికలలో ఓటర్లకు డబ్బు పంచాము కానీ అందరికీ అందలేదని. మరి ఎన్నికల సంఘానికి ఇదంతా వినపడలేదా? కనపడలేదా?
ఎన్నికల సంఘం కొడాలి నానిపై చర్యలు తీసుకోకపోయినా, గుడివాడ ఓటర్లు ఇప్పటికే చర్య తీసుకున్నారు. ఈ విషయం ఆయనకు కూడా అర్దమైంది కనుకనే పోలింగ్ తర్వాత సైలంట్ అయిపోయిన్నట్లున్నారు.




