సత్తెనపల్లిలో కోడెల శివరాం… తగ్గేదేలే!

Kodela-Sivaram-Palnaduదివంగత డా.కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం తండ్రి మరణించినప్పటి నుంచి సత్తెనపల్లి నుంచి తానే శాసనసభకు పోటీ చేయడం ఖాయమని భావిస్తూ నాలుగేళ్ళుగా పనిచేసుకు పోతున్నారు. అయితే అక్కడ నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తుండటంతో ఆయనను ఎదుర్కొనేందుకు మంచి అర్దబలం, అంగబలం ఉన్న కన్నా లక్ష్మినారాయణకు చంద్రబాబు నాయుడు టికెట్‌ని ఖరారు చేశారు.

ADVERTISEMENT

సహజంగానే కోడెల శివరాం ఇది జీర్ణించుకోలేక పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను ఎట్టి పరిస్థితులలో కన్నా లక్ష్మినారాయణతో కలిసి పనిచేయనని, ఆయనకు తన సహకారం ఉండదని కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతున్నారు. అంతేకాదు… వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు.

సత్తెనపల్లి మండలంలోని పెద్దమక్కేనా గ్రామంలో ఆయన తన అనుచరులతో కలిసి ఇంటింటికీ కోడెల… పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఒకప్పుడు సత్తెనపల్లిలో పసుపు జెండా కనిపిస్తే మా తండ్రిగారు కోడెల గుర్తువచ్చేవారు. కానీ ఆయన పోయినప్పటి నుంచి నేను ఒంటరి పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

చివరికి నాకు దక్కాల్సిన సత్తెనపల్లి సీటుని బయట నుంచి వచ్చిన కన్నా లక్ష్మినారాయణకు ధారాదత్తం చేశారు. అలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలా? నేను పల్నాటి గడ్డ మీద పుట్టిన పులి బిడ్డని. పిల్లులతో కలిసి తిరగలేను. సత్తెనపల్లి ప్రజలు నా వెంట ఉన్నారు. వారి ఆశీర్వాదం ఉన్నంత వరకు నేను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు,” అని కోడెల శివరాం అన్నారు.

కోడెల శివరాం సత్తెనపల్లి సీటు ఆశించడం న్యాయమే. అది దక్కన్నప్పుడు అసంతృప్తి చెందడం కూడా సహజమే. కనుక కోడెల శివప్రసాద రావు టిడిపికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన తనయుడికి చంద్రబాబు నాయుడు ఏదో విదంగా న్యాయం చేస్తే బాగుంటుంది. అలాగే కోడెల శివరాం కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను, అధికారంలోకి వచ్చేందుకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని కాస్త వెనక్కు తగ్గితే బాగుంటుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీలో అందరూ సర్దుకుపోయి కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రాగలుగుతుందని అందరూ గ్రహించడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories