నిన్న గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేస్తున్నట్లు తెలుసుకొన్న టిడిపి సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అక్కడికి వెళ్లబోతుంటే దారిలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఇంటికి రాకపోవడంతో పట్టాభి భార్య చందన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన భర్త ఆచూకీ కోసం టిడిపి కార్యకర్తలు రాత్రంతా అన్ని పోలీస్ స్టేషన్లలో వెతికారని కానీ ఆయన ఎక్కడున్నారో తెలియలేదని చెప్పారు. ఈరోజు ఉదయం 11 గంటలలోగా తన భర్త ఎక్కడున్నారో పోలీసులు చెప్పకపోతే తాను డిజిపి ఇంటి ముందు దీక్ష చేపడతానని హెచ్చారించారు. ఆమె అక్కడికి బయలుదేరేందుకు సిద్దపడుతుండగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత పట్టాభిని గన్నవరం కోర్టుకి తీసుకురాబోతున్నట్లు పోలీసులు వచ్చి తెలియజేశారు. అయితే వీడియో కాల్ చేసి తన భర్తతో మాట్లాడించాలని ఆమె కోరగా పోలీసులు నిరాకరించారు. దాంతో ఆమె వెంటనే తన కారులో కోర్టుకి వెళుతుండగా పోలీసులు ఆమె కారుని బైక్‌పై వెంబడించి అడ్డుకొని మళ్ళీ వెనక్కి పంపించారు. ప్రస్తుతం ఆమెని ఇంట్లో నుంచి బయటకి రాకుండా గృహనిర్బందంలో ఉంచారు. ‘ఛలో గన్నవరం’కి బయలుదేరుతున్న టిడిపి నేతలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ లేదా గృహ నిర్బందం నిర్బందం చేస్తున్నారు.
ఎప్పటిలాగే టిడిపి కార్యాలయంపై దాడులు చేసి, కార్లకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించిన వైసీపీ కార్యకర్తలు (వల్లభనేని వంశీ అనుచరులు)కి బదులు వారిని టిడిపి నేతలు, కార్యకర్తలే రెచ్చగొట్టారంటూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కవ్వింపుల వలననే ఈ దాడులు జరిగిన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. గన్నవరంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సెక్షన్ 144 విధించామని తెలిపారు. కనుక పట్టణంలో ఎవరూ సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ‘టిడిపి కార్యాలయంపై నిన్న జరిగిన దాడులపై సుమోటుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.



