chandrababu-naidu-ap-chief-secretary

రాజకీయ పార్టీల చేతిలో బలమైన మీడియా ఉంటే నందిని పందిగా, పందిని నందిగా నమ్మించగలవని ఏపీలో వైసీపి, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నిరూపించి చూపాయి.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే జగన్‌ కోసం చేయకూడని పనులన్నీ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ పక్కనబెట్టి, జగన్‌ ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా విధులు మాత్రమే నిర్వహించినవారికి, సమర్ధులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.

Also Read – ఈ వయసులో డీఎన్ఏ టెస్ట్… ఇబ్బందే!

జగన్‌ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఓ రాజకీయ పార్టీ నాయకుడు కూడా. కనుక ఆయన తన పార్టీకి రాజకీయంగా లబ్ధి కలిగించేందుకు అనేక అనుచిత నిర్ణయాలు తీసుకుని అధికారుల చేత అమలు చేయించారు. అందుకు వారిని తప్పుపట్టలేము.

కానీ జగన్‌ని మెప్పు కోసం పలువురు ఉన్నతాధికారులు తమ పరిధి దాటి చేయకూడని పనులుచేశారు. అలా చేయడం సరికాదని, నిష్పక్షపాతంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తదితరులు ఆనాడే పదేపదే హెచ్చరించారు కూడా.

Also Read – రాజకీయమా? రాక్షసత్వమా?

కానీ ఆనాడు జగన్‌ బెదిరింపులకు భయపడి లేదా ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి ప్రలోభాలకో లొంగిపోయిన కొందరు అధికారులు చేయకూడని పనులన్నీ చేశారు.

ప్రతిపక్షాలనే కాదు… చివరికి ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులను కూడా వేధించారు. కనుక అటువంటివారిని సిఎం చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి సమర్ధులైన టీమ్ ఏర్పాటు చేసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.

Also Read – జగన్‌కు క్లారిటీ ఉంది… మరి టిడిపికి?

కానీ (సాక్షి) మీడియా పేరుతో కొమ్మినేనివారు సిఎం చంద్రబాబు నాయుడుకి సుద్దులు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అప్పుడే అధికారులను అవమానిస్తున్నారని, కొందరిపై కక్ష కట్టిన్నట్లు వ్యవహరిస్తున్నారని ఇది సరికాదంటూ ఈరోజు సాక్షి ఆన్‌లైన్‌ సంచికలో ‘అధికారుల వల్లే నాడు టిడిపి ఓడిపోయిందని చెప్పగలరా?’ అనే శీర్షికతో పెద్ద కధనం వ్రాసి పడేశారు.

కొందరు అధికారుల వలన చంద్రబాబు నాయుడుకి, ఆయన పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురైనా వారందరూ గత ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేశారని గుర్తుంచుకొని, అందరినీ సమానంగా చూడాలని కొమ్మినేనివారు సిఎం చంద్రబాబు నాయుడుకి హితవు చెప్పారు.

అయితే మాజీ ఐపిఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు పట్ల జగన్‌ ప్రభుత్వం చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు కొమ్మినేనివారికి కనపడలేదు. జగన్‌కు హితవు చెప్పాలనుకోలేదు.

కరోనా సమయంలో గ్లౌజులు కూడా లేవని చిన్న విమర్శ చేసినందుకు జగన్‌ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్‌ని నడిరోడ్డులో బట్టలు ఊడదీయించి కరడు గట్టిన ఉగ్రవాదిని బందించిన్నట్లు చేతులు వెనక్కు విరిచి కట్టించినప్పుడు, ఆయనకు పిచ్చి పట్టిందని బలవంతంగా మెంటల్ హాస్పిటల్లో చేర్పించినప్పుడు, ఈ అవమానాలు భరించలేక ఆయన గుండెపోటుతో చనిపోయినప్పుడు కొమ్మినేనివారు చూడలేదు. జగన్‌కు హితవు చెప్పలేదు.

కూతురు చికిత్స కోసం కాకినాడకు చెందిన ఆరుద్ర తిప్పలు పడుతున్నప్పుడు ఆమెను వైసీపి నేతలు వేధించి హైదరాబాద్‌ పారిపోయేలా చేసినప్పుడు కొమ్మినేనివారికి తప్పుగా అనిపించలేదు.

దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు కొమ్మినేని వారికి అభ్యంతరంగా అనిపించలేదు.

ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. అప్పుడు జగన్‌కు సుద్ధులు చెప్పని కొమ్మినేనివారు ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుకి సుద్ధులు చెపుతుండటం హాస్యాస్పదమే కదా?

జగన్‌ తప్పుడు విధానాలు ప్రజలకు నచ్చలేదు గాబట్టే ఎన్నికలలో ఓడించారు. జగన్‌ ధోరణి వలననే ఆయనను నమ్ముకున్న వైసీపి నేతలందరూ మునిగిపోయారు. ఈ విషయం తెలిసి కూడా కొమ్మినేనివారు ఇంకా జగన్‌ కోసం మీడియా పేరుతో ఎదుటవారిని వేలెత్తి చూపితే చివరికి ఆయన కూడా మూల్యం చెల్లించవలసివస్తే అప్పుడు జగన్‌ వచ్చి ఆదుకోరని గ్రహిస్తే మంచిదేమో?