మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ జనసేన నిజనిర్ధారణ కమిటి సమావేశాలకు ఆహ్వానించబడి ఒక్క రోజు వెళ్లారు కూడా. ఐతే అక్కడ ఏమైందో ఏమో గానీ కేవలం నిజనిర్ధారణల వల్ల ఉపయోగం ఉండదన్న విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుర్తించాలని సూచించారు.
మేధోమథనంతో పాటు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రత్యక్ష కార్యాచరణ అవసరమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణాంకాలు, నివేదికలు తీసుకున్న తర్వాత పవన్ ఏం చేస్తారో చెప్పాలన్నారు. మీరు కూడా ఆ సమావేశాలకు వెళ్లారు కదా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆయన తాను ఒకేరోజు హాజరయ్యానని, అయితే ద్విముఖ వ్యూహం ఉంటే తప్ప ఆయన సాధించేదేమీ ఉండబోదని తెలిపారు.
అదే సమయంలో ఆ భేటీకి టీడీపీ, వైసీపీలను కూడా ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు. ఇక ముందు హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాబట్టి నవ్యాంధ్రలోనే అటువంటి సమావేశాలను నిర్వహించాలని ఆయన పవన్ కళ్యాణ్ కు సూచించారు.



