జగన్ పార్టీ నుండి ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలిసి మొత్తంగా రెండెంకల స్కోర్ ను అందుకున్నారు. అయితే ఈ “క్యూ” ఇప్పట్లో అయిపోయేలా లేదని, తాజాగా మరికొందరి పేర్లు వినపడుతున్నాయి. జగన్ కు దూరంగా ఉంటున్న కొణతాల రామకృష్ణ వంటి వారితో పాటు కొందరు ముఖ్య నాయకులు నేడే, రేపో అన్న రీతిలో సైకిల్ పై పయనించడానికి సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకూ రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు శ్రీకాకుళం నేతలు అధికార పార్టీలో చేరగా, తాజాగా విశాఖ జిల్లా వంతు వచ్చినట్లుంది. ఒకప్పుడు జగన్ కు మరియు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కొణతాల రామకృష్ణతో పాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు టీడీపీ బాట పట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొణతాల – చంద్రబాబుల మధ్య చర్చలు పూర్తయ్యాయని, అలాగే గండి బాబ్జీ కూడా పార్టీ మార్పుపై ఒక నిర్ణయం తీసేసుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.



