సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో డేటింగ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబుకి జంటగా నటించిన కృతి సనన్ తాజాగా చెప్పుకొచ్చింది. తెలుగులో రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ధోని’ ఫేం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, ఈమె ప్రేమలో మునిగి తేలుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సుదీర్ఘ కాల ప్రేయసి అంకిత లోఖండేను కూడా వదిలేశాడని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. వీటికి మరింత బలం చేకూరే విధంగా… ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని, అయితే సుశాంత్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది.
“ఎదుటివారితో మన ఆలోచనలు కలవచ్చు లేదా కలవకపోనూ వచ్చు. అయితే ఇద్దరి ఆలోచనలు కలిసినప్పుడే వారిద్దరూ ఒకరికొకరు కనెక్ట్ అవ్వగలరు. అంతే తప్ప ఓ వ్యక్తితో మన రిలేషన్ ని ముందే ప్లాన్ చేసుకోలేం. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. అయితే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్ చేయడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. వేరు వేరు వృత్తుల్లో ఉన్నవారితో డేటింగ్ కంటే ఒకే వృత్తిలో ఉన్న బాయ్ ఫ్రెండ్ దొరికితే మనల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు కదా” అంటూ పెద్ద ఫిలాసఫీ చెప్పింది. దీంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కృతి ఇలా సిగ్నల్ ఇస్తోందని బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తొలుత “పవిత్ర రిష్తా” సీరియల్ లో కనిపించిన సుశాంత్, ఆ సీరియల్ లో సహనటి అంకిత లోఖండేతో సుదీర్ఘ కాలం డేటింగ్ చేశాడని, అలాగే మరో బ్యూటీ యామీ గౌతమ్ తో కూడా డేటింగ్ చేశాడని వార్తలు వెలువడ్డాయి. అనంతరం కృతి సనన్ తో సినిమా చేస్తూ… వారిద్దరూ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫోటోలు చూసిన అంకిత బ్రేకప్ చెప్పేసిందన్న టాక్ వెలువడింది. మరోవైపు అంకిత మద్యం బాగా తాగుతోందని, తరువాత రచ్చ రచ్చ చేస్తోందని, అందుకే తమకు బ్రేకప్ అయిందని సుశాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.



