కొన్ని విషయాలలో రాహుల్ గాంధీ, కేటీఆర్‌లు పోలికలు ఉండటం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ పదేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పుడు, ప్రధాని కుర్చీలో మన్మోహన్ సింగ్‌ను కూర్చోబెట్టి దేశాన్ని సోనియా గాంధీయే పరిపాలించరనేది బహిరంగ రహస్యం.
అందుకే కాంగ్రెస్ నేతలందరూ సోనియా గాంధీయే తెలంగాణ ఇచ్చారని చెప్పుకొంటారు తప్ప ప్రధాని మన్మోహన్ ఇచ్చారని ఏనాడూ చెప్పుకోరు. ఆమె కనుసన్నలలో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చేబెట్టాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆయన అంత గొప్ప అవకాశాన్ని గుర్తించలేకపోయారు. చివరికి గుర్తించి, అందుకు సిద్దపడినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది.
ఆ తర్వాత ఆ కుర్చీలో నరేంద్రమోడీ సెటిల్ అయిపోయారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశాన్ని చేజార్చుకొని ఆ తర్వాత ఎంత ప్రయత్నిస్తున్నా కాలేకపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. భవిష్యత్‌లోనైనా ప్రధాని కాగలరో లేదో తెలీదు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అయినా కాంగ్రెస్‌కు అభ్యంతరం లేదని మల్లిఖార్జున ఖర్గే చెప్పేశారు కూడా.
ఈ విషయంలో కేటీఆర్‌కి కూడా ఇంచుమించు ఆవిదంగానే జరిగిందని చెప్పక తప్పదు. ఇటు మంత్రిగా అటు రాజకీయ నాయకుడుగా కేటీఆర్ తన సమర్ధత నిరూపించుకొన్నారు. కనుక ఆయనను ముఖ్యమంత్రి చేయబోతున్నామని కేసీఆర్ పలుమార్లు తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత చెప్పించారు కూడా. కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని కేసీఆర్ తనను అడిగారని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల బయటపెట్టారు కూడా.
కానీ రాష్ట్రంలో రాజకీయ సవాళ్ళును దృష్టిలో ఉంచుకొనో లేదా ఎలాగూ మనమే మరో 30 ఏళ్ళు అధికారంలో ఉంటామనే నమ్మకంతోనో కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేయలేదు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో తెలీదు. కనుక కేటీఆర్ కూడా రాహుల్ గాంధీలాగే ఓ గొప్ప అవకాశం కోల్పోయారని అర్దమవుతోంది.
కాంగ్రెస్ తనంతట తానుగా ఎన్నటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఇండియా కూటమి వచ్చినా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కానీ కేటీఆర్ పదేళ్ళు మంత్రిగా చేసి తన సమర్ధతను నిరూపించుకొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కనుక భవిష్యత్‌లో ఏదో రోజు మళ్ళీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈవిషయంలో రాహుల్ గాంధీ కంటే కేటీఆర్ అదృష్టవంతుడే అనుకోవచ్చు.




