కేటీఆర్ లో ఈ మధ్య పొలిటికల్ ఫ్రస్టేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు పార్టీ ఓటమి ఒక కారణం అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలు మరో కారణంగా చెప్పవచ్చు. దానికి తోడు గత పదేళ్ల బిఆర్ఎస్ అభివృద్ధి నేడు అవినీతి గా ప్రజల దృష్టిని ఆకర్షించడం కేటీఆర్ ఆక్రోశానికి అసలు కారణంగా భావించవచ్చు.
అసలు విషయానికొస్తే, కాళేశ్వరం ఒక మానవ మేధస్సుకి అద్భుతం, ఇది తెలంగాణకు ఆయువు పట్టు, ఈ మహా అద్భుతాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే, బిఆర్ఎస్ పార్టీదే అంటూ నాడు జబ్బలు చరుచుకున్న బిఆర్ఎస్ నాయకులు నేడు అదే కాళేశ్వరం అవినీతి మీద ప్రజలకు జవాబుదారీగా, ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితికొచ్చారు.
కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి, బిఆర్ఎస్ అక్రమాలు అంటూ రేవంత్ సర్కార్ కాళేశ్వరం తెరవెనుక కథను నివేదికలు రూపంలో ప్రజలముందుంచింది. అలాగే కాళేశ్వరం కూలేశ్వరం అంటూ ప్రాజెక్ట్ పిల్లర్లో ఏర్పడిన పగుళ్లతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీజేపీ తెలంగాణలో బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
దీనితో కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలకు, విమర్శలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం లో రెండు పగుళ్లు కనిపిస్తేనే కూలేశ్వరం అంటూ నానా హంగామా చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ లు ఏపీలో జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం కాపర్ డాం రెండోసారి కూడా కొట్టుకుపోయినా కనిపించడం లేదా.?
రెండు పగుళ్ళొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ‘కూలేశ్వరం’ అయితే రెండు సార్లు కొట్టుకుపోయిన పోలవరం కాపర్ డాం ‘కూలవరం’ కాదా.? పోలవరం ను కూడా కూలవరం అనే ధైర్యం ఉందా మీకు.? పోలవరం కు ఒక న్యాయం.? కాళేశ్వరానికి మరో న్యాయమా.? అంటూ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపి ల పై విరుచుకుపడ్డారు.
అయితే బిఆర్ఎస్ ఉనికి కోసం, బిఆర్ఎస్ బతుకు కోసం చివరికి బిఆర్ఎస్ అవినీతి బురద కడగడం కోసం కూడా కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ పైన ఇక్కడి రాజకీయ నాయకుల పైన, చివరికి ఇక్కడి ప్రోజెక్టుల పైన కూడా రాజకీయం చేయాల్సిందేనా.? అది బనకచర్ల అయినా పోలవరం అయినా కేటీఆర్ కు ఒక్కటేనా.?




