తెలుగు నాట ఇంకా ప్రారంభం కాలేదు గానీ, తమిళనాట ఇప్పటికే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్’ షో ప్రేక్షకులను పలకరించింది. వంద రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో సెలబ్రిటీలతో కలసి ఉండే కాన్సెప్ట్ తో తయారైన ఈ రియాలిటీ షోలో నటుడు శక్తి, శ్రీ, హాస్యనటుడు వయ్యాపురి, గంజాకరుప్పు, నటి నమిత, అనూయ, ఓవియాలతో పాటు మొత్తం 15 మంది పాల్గొనగా, వీరిలో ఇప్పటికే అనూయ, నటుడు శ్రీలు ఎలిమినేట్ అయిపోయారు.
దీనిపై తాజాగా కోలీవుడ్ నటి లక్ష్మీరామకృష్ణన్ స్పందిస్తూ… తనకు పది కోట్లిచ్చినా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనని, ‘బిగ్ బాస్’లో పాల్గొనేందుకు తనను సంప్రదించారని, అయితే వంద రోజుల పాటు కుటుంబాన్ని వదిలి ఉండాలన్న షరతును అంగీకరిచలేక ఆఫర్ వదులుకున్నానని చెప్పారు. అంతే కాకుండా తాను దర్శకత్వం వహించే సినిమా చిత్రీకరణ జరుగుతోందని, మరోవైపు పలు సినిమాల్లో నటిస్తున్నానని, ఆ ఆఫర్లను ‘బిగ్ బాస్’ కోసం వదులుకోవడం సరైన నిర్ణయం కాదని భావించి అంగీకరించలేదని చెప్పారు.



